Saumitra Khan: టీఎంసీలో చేరిన భార్య.. విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైన బీజేపీ ఎంపీ

BJP MP Saumitra decides to send divorce notice to his wife after she joins TMC

  • భార్య బీజేపీలో చేరడంతో సౌమిత్ర ఖాన్ కీలక నిర్ణయం
  • తన ఇంటి పేరును కూడా తొలగించుకోవాలని వ్యాఖ్య
  • ప్రతి నెల 50 శాతం జీతాన్ని ఆమె బ్యాంకు ఖాతాలో వేస్తానన్న ఎంపీ

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమబెంగాల్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విష్ణుపూర్ బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ భార్య సుజాత మోండల్ ఖాన్ టీఎంసీలో చేరారు. దీంతో, సౌమిత్ర ఖాన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తన జీవితంలోనే అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. భార్యకు విడాకుల నోటీసు పంపేందుకు సిద్ధమయ్యారు.

ఈ సందర్భంగా సౌమిత్ర ఖాన్ మాట్లాడుతూ, టీఎంసీలో చేరి ఆమె పెద్ద తప్పు చేసిందని అన్నారు. ఇకపై ఆమెకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నానని చెప్పారు. తన ఇంటి పేరు ఖాన్ ను కూడా ఆమె తొలగించుకోవాలని అన్నారు. తనకు వచ్చే జీతంలో 50 శాతాన్ని ప్రతి నెల ఆమె బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేస్తానని తెలిపారు. బీజేపీ తనకు ఎన్నో విధాలుగా గుర్తింపును ఇచ్చిందని చెప్పారు. బీజేపీ అనే పేరు లేకుండా తాను గెలిచేవాడిని కాదని అన్నారు. తన గెలుపు కోసం తన భార్య కూడా ప్రచారం చేసిన సంగతి నిజమేనని చెప్పారు.

టీఎంసీ తనను ఎంతో ఇబ్బంది పెట్టిందని... ఇంటికి కరెంట్ సరఫరా నిలిపేశారని, బెదిరింపులకు కూడా పాల్పడ్డారని సౌమిత్ర మండిపడ్డారు. అలాంటి టీఎంసీ పన్నాగంలో తన భార్య పడిందని చెప్పారు.

మరోవైపు సౌమిత్ర భార్య సుజాత మాట్లాడుతూ, కుటుంబం వేరు, రాజకీయాలు వేరని చెప్పారు. రెండూ ఎప్పుడూ ఒకే ప్లాట్ ఫామ్ పై ఉండవని అన్నారు. భవిష్యత్తులో సౌమిత్ర ఖాన్ టీఎంసీలో చేరరనే గ్యారంటీ ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. మరోవైపు సౌమిత్ర బీజేపీ రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు.

  • Loading...

More Telugu News