Rajinikanth: యాంటీ స్టెరిలైట్ నిరసనల వ్యవహారంలో రజనీకాంత్ కు సమన్లు
- 2018లో తూత్తుకుడిలో విషాదం
- స్టెరిలైట్ కర్మాగారం మూసివేయాలంటూ ప్రజల ఆందోళనలు
- కాల్పుల్లో 13 మంది పౌరుల మృతి
- నిరసనల్లో సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డాయన్న రజనీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు తూత్తుకుడి కాల్పుల ఘటన విచారణ కమిటీ సమన్లు జారీ చేసింది. తూత్తుకుడిలో ఉన్న వేదాంత స్టెరిలైట్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేయాలంటూ 2018లో పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహించగా, ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో 13 మంది ఆందోళనకారులు మృతి చెందారు. అప్పట్లో ఈ ఘటనపై రజనీకాంత్ స్పందిస్తూ, నిరసనల్లోకి సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డాయంటూ వ్యాఖ్యానించారు.
కాగా ఈ ఘటనపై రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీ విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో, విచారణకు సహకారం అందించాలంటూ కమిటీ రజనీకాంత్ ను కోరింది. ఈ మేరకు సమన్లు పంపింది.
అప్పట్లో ఈ నిరసనలు విషాదాంతం కావడం పట్ల రజనీ చేసిన వ్యాఖ్యలపై ఆయనను మీడియా వివరణ కోరింది. ఇందులో అసాంఘిక శక్తులు ప్రవేశించాయని మీకు ఎలా తెలుసు అని ప్రశ్నించగా, ఆయన ఆగ్రహంతో స్పందించారు. ఎలా తెలుసని నన్నడగొద్దు... నాకు మొత్తం తెలుసు అంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ప్రతి అంశంలోనూ నిరసనలు తెలపడం ప్రారంభిస్తే తమిళనాడు వల్లకాడు అవుతుందని అభిప్రాయపడ్డారు. యూనిఫాంలో ఉన్న వ్యక్తులు ప్రజలకు హాని కలిగిస్తే దాన్ని తాను సహించబోనని రజనీ స్పష్టం చేశారు.