Assam: అసోం ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోయిన 64 మంది తీవ్రవాదులు.. కొత్త శకం ప్రారంభమైందన్న డీజీపీ
- లొంగిపోయిన వారిలో రెండు సంస్థల కమాండర్లు
- అభినందించిన డీజీపీ
- హింస అంటే దేశాభివృద్దిని అడ్డుకోవడమేనని వ్యాఖ్య
నాలుగు తీవ్రవాద సంస్థలకు చెందిన 64 మంది తీవ్రవాదులు నిన్న అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఎదుట ఆయుధాలను వదిలి లొంగిపోయారు. వీరిలో 18 ఉల్ఫా, 32 మంది యూపీఆర్ఎఫ్, 13 మంది డీఎన్ఎల్ఎఫ్, ఒకరు పీడీసీకే సంస్థలకు చెందినవారు ఉన్నారు. ఉల్ఫా డిప్యూటీ కమాండర్ ఇన్ చీఫ్ దృష్టి రాజ్‌ఖోవా, పీడీసీకే కమాండర్ ఇన్ చీఫ్ ఆన్ టెరాన్‌లు కూడా ఉండడం గమనార్హం.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత మాట్లాడుతూ, తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో కలవడాన్ని అభినందించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మరింత మంది ముందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో కొత్తశకం ఆరంభమైందని, తీవ్రవాదుల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. హింస అంటే రాష్ట్ర, దేశాభివృద్దిని అడ్డుకోవడమేనని అన్నారు. వారి పునరావాసానికి తగిన ఏర్పాట్లు చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారు.