Corona Virus: ‘స్పుత్నిక్-వి’తో కరోనా కొత్త జాతికి అడ్డుకట్ట: రష్యా
- తమ టీకా కొత్త స్ట్రెయిన్‌పై ప్రభావం చూపుతుందన్న డిమిట్రీవ్
- ఫార్మాస్యూటికల్ కంపెనీతో కలిసి పనిచేస్తున్నామన్న ఆర్డీఐఎఫ్
- స్పుత్నిక్ టీకా వినియోగానికి బెలారస్లో రిజిస్ట్రేషన్
ఇతర దేశాల కంటే ముందే కరోనా వైరస్‌కు టీకా తీసుకొచ్చి రికార్డులకెక్కిన రష్యా మరో కీలక ప్రకటన చేసింది. బ్రిటన్‌లో వెలుగు చూసి బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్ కొత్త జాతిపై సర్వత్ర భయాందోళనలు వెల్లువెత్తుతున్న వేళ రష్యా ఊరటనిచ్చే ప్రకటన చేసింది. తమ కొవిడ్-19 టీకా ‘స్పుత్నిక్-వి’ టీకా కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్‌పై ప్రభావవంతంగా పనిచేస్తుందని విశ్వసిస్తున్నట్టు వ్యాక్సిన్ అభివృద్ధిలో పాలుపంచుకున్న రష్యా డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) సీఈవో కిరిల్ డిమిట్రీవ్ తెలిపారు. ఎస్-ప్రొటీన్ గత పరివర్తనలపైనా ఈ టీకా ఎంతో ప్రభావవంతంగా పనిచేసినట్టు చెప్పారు.
కరోనా వైరస్ కొత్త జాతిని ఎదుర్కొనేందుకు ఆస్ట్రాజెనెకాతోపాటు మరో వ్యాక్సిన్ తయారీ కంపెనీతో కలిసి పనిచేస్తున్నట్టు డిమిట్రీవ్ తెలిపారు. వైరస్ మ్యుటేషన్ చెందుతున్న ఇలాంటి సమయాల్లో ఫార్మాస్యూటికల్ కంపెనీలతో కలిసి పనిచేయడం అత్యంత ఆవశ్యకమన్నారు. తమ టీకా వినియోగానికి సంబంధించి తాజాగా బెలారస్‌లోనూ రిజిస్టర్ చేసుకున్నట్టు పేర్కొన్నారు. కాగా, స్పుత్నిక్-వి వ్యాక్సిన్ 97 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గతవారం ప్రకటించారు.