Nagarjuna: తెలుగు టీవీ ప్రేక్షకుల ముందుకు రానున్న చారిత్రక సీరియల్!
- స్టార్ మాలో ప్రసారం కానున్న రుద్రమదేవి
- ఇటీవలే ప్రోమోను విడుదల చేసిన నాగార్జున
- తెలుగు జీఈసీల్లో తొలి చారిత్రక సీరియల్
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను మరో చారిత్రక ధారావాహిక అలరించనుంది. 13వ శతాబ్దానికి చెందిన కాకతీయ సామ్రాజ్ఞి రాణి రుద్రమదేవి జీవిత కథ ఆధారంగా రూపొందిన సీరియల్ స్టార్ మా టీవీలో ప్రసారం కానుంది. తెలుగు జీఈసీ (జనరల్ ఎంటర్ టెయిన్ మెంట్ చానెల్స్)ల్లో తొలి చారిత్రాత్మక కథనం ఇదేనని ఈ సందర్భంగా స్టార్ మా తరఫున హీరో నాగార్జున మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం జరిగిన బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలేలో సీరియల్ 'రుద్రమదేవి - సాటిలేని మహారాజు' ప్రోమోను ఆయన విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఈ ప్రోమో వైరల్ అయింది. తెలుగు టీవీ చరిత్రలో అత్యధికంగా గ్రాఫిక్స్ ను వాడుతూ దీన్ని తీసినట్టు మాటీవీ ప్రతినిధి ఒకరు తెలిపారు. రాణి రుద్రమదేవి కథ చరిత్రలో అసమానమైనదని, యువరాణిగా రాజకుటుంబంలో జన్మించిన ఆమె, యుద్ధ విద్యలలో శిక్షణ పొంది, సింహాసనాన్ని దుష్టశక్తుల బారినపడకుండా కాపాడుకుందని, అదే కథాంశంతో ఈ సీరియల్ ను రూపొందించామని అన్నారు.
మహిళలకు రాజ్యాధికారం పట్ల సమాజంలో ఉన్న భావనలను పోగొట్టడమే కాదు, చక్రవర్తిగానూ ఆమె అసమాన పోరాట పటిమ చూపుతూ అపారమైన రాజకీయ పరిపాలనను తన తండ్రి గణపతిదేవుడి నుంచి సొంతం చేసుకున్నదని అన్నారు. స్ఫూర్తిదాయక మరియు వినోదాల మేళవింపుతో దీన్ని తయారు చేసి, ప్రేక్షకులకు అందిస్తున్నామని తెలిపారు.