Narendra Modi: దేశంలో మతాలకు అతీతంగా అందరికీ సమాన అవకాశాలు: మోదీ
- ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి
- ప్రతి వ్యక్తికి రాజ్యాంగ పరమైన హక్కులు
- భవిష్యత్‌పై భరోసాతో దేశం ముందుకు కదులుతోంది
భారత్‌లో ఎవరిపైనా వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని, ఈ విధానం ప్రకారమే దేశం ముందుకు సాగుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ స్థాపించి 100 ఏళ్లైన సందర్భంగా నిర్వహించిన మహోత్సవానికి మోదీ ముఖ్య అతిథిగా వర్చువల్ పద్ధతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... దేశంలోని ప్రతి వ్యక్తికి రాజ్యాంగ పరమైన హక్కులు లభిస్తున్నాయని చెప్పారు.
భవిష్యత్‌పై భరోసాతో దేశం ముందుకు కదులుతోందని చెప్పుకొచ్చారు. భారత్‌లో మతాలకు అతీతంగా ప్రతి వ్యక్తి సమాన అవకాశాలు పొందుతున్నాడని ఆయన చెప్పారు. సమాన గౌరవం పొందుతూ ప్రజలు తమ కలల్ని నిజం చేసుకుంటున్నారని, దేశంలో అందరితో కలిసి అందరి అభివృద్ధి కోసం అనే నినాదం ఉందని చెప్పారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మినీ ఇండియా వంటిదని, ఆ వర్సిటీ దేశానికే ఆదర్శమని ఆయన తెలిపారు.