Corona Virus: పిల్లలకు కొత్తరకం కరోనా త్వరగా వ్యాప్తి చెందుతుందంటున్న నిపుణులు
- దక్షిణ బ్రిటన్ లో కొత్త రకం కరోనా వైరస్
- త్వరలోనే బ్రిటన్ మొత్తం పాకిపోతుందంటున్న నిపుణులు
- పిల్లలు దీనిబారిన పడే అవకాశాలు అధికం అని వెల్లడి
- దీని కారణంగా కలిగే మరణాలపై స్పష్టతలేదని వివరణ
బ్రిటన్ లో కల్లోలం సృష్టిస్తున్న కరోనా కొత్త స్ట్రెయిన్ గురించి ఓ ఆసక్తికర అంశం వెల్లడైంది. ఈ కొత్తరకం కరోనా వైరస్ చిన్నారుల్లో త్వరగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు అంటున్నారు. జన్యు ఉత్పరివర్తనాలకు లోనైన ఈ కరోనా వైరస్ తో పిల్లల్లో తీవ్రస్థాయిలో ఇన్ఫెక్షన్లు కలిగే అవకాశం ఉందని, రోగనిరోధకశక్తి గణనీయంగా తగ్గిపోతుందని వివరించారు. బ్రిటన్ కు చెందిన నెర్వ్ టాగ్ ప్రభుత్వ సంస్థ (న్యూ అండ్ ఎమర్జింగ్ రెస్పిరేటరీ వైరస్ థ్రెట్స్ అడ్వైజరీ గ్రూప్) నిపుణులు ఈ మేరకు స్పష్టం చేశారు.
ప్రస్తుతం కరోనా కొత్తరకం వైరస్ దక్షిణ బ్రిటన్ లో మహమ్మారిలా వ్యాపిస్తోందని, త్వరలోనే యావత్ బ్రిటన్ ను కమ్మేస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బ్రిటన్ లో వ్యాప్తిలో ఉన్న అన్ని కరోనా వైరస్ రకాల్లోనూ ఈ కొత్తరకం వైరస్ ఆధిపత్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోందని నెర్వ్ టాగ్, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పీటర్ హార్బీ వెల్లడించారు.
అయితే, ఇది ప్రధానంగా చిన్నారులకు అధికంగా సోకే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయని, మరణాల సంఖ్య తెలియకపోయినా, అందుబాటులో ఉన్న డేటా ప్రకారం పిల్లలకు అధికంగా సోకుతున్నట్టు తెలుస్తోందని నెర్వ్ టాగ్ సంస్థ సభ్యుడు, లండన్ ఇంపీరియల్ కాలేజ్ ప్రొఫెసర్ నీల్ ఫెర్గుసన్ వివరించారు.