Sister Abhaya: మర్డర్ మిస్టరీ సినిమాకు తీసిసోని సిస్టర్ అభయ హత్య కేసు... 28 ఏళ్ల తర్వాత న్యాయం జరిగింది!
- 90వ దశకంలో సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ కేసు
- ఓ అక్రమ సంబంధం వ్యవహారాన్ని చూసిన సిస్టర్ అభయ
- కర్రతో కొట్టి బావిలో పడేసిన ఫాదర్ కొట్టూర్, నన్ సెఫీ
- ఆత్మహత్యగా భావించిన పోలీసులు
- కోర్టును ఆశ్రయించిన మానవహక్కుల కార్యకర్త
- సుదీర్ఘ విచారణ తర్వాత గెలిచిన న్యాయం
ఓ అక్రమ సంబంధం వ్యవహారాన్ని కళ్లతో చూసిన పాపానికి అన్నెంపున్నెం ఎరుగని సిస్టర్ అభయ బలైపోయి 28 ఏళ్లవుతోంది. ఇన్నాళ్లకు ఆమె హత్య కేసులో న్యాయం జరిగింది. సిస్టర్ అభయను హత్య చేసిన ఫాదర్ థామస్ కొట్టూర్, క్రైస్తవ సన్యాసిని సెఫీలను సీబీఐ కోర్టు దోషులుగా నిర్ధారించింది. కేరళలో రెండున్నర దశాబ్దాలకు పైగా కొనసాగిన ఈ కేసు ఓ మర్డర్ థ్రిల్లర్ మూవీని తలపిస్తుందంటే అతిశయోక్తి కాదు.
ఈ కేసు వివరాల్లోకి వెళితే... కొట్టాయంకు చెందిన సిస్టర్ అభయ (బీనా థామస్) 1973లో జన్మించింది. ప్రీ డిగ్రీ విద్యాభ్యాసం కోసం బీసీఎం కాలేజిలో చేరిన 21 ఏళ్ల సిస్టర్ అభయ సెయింట్ పయస్ హాస్టల్ లో ఉంటూ చదువుకునేది. అదే కాలేజీలో ఫాదర్ థామస్ కొట్టూర్, జోస్ పుత్రక్కయాల్ లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ఒకరోజు ఉదయం క్రైస్తవ సన్యాసిని సెఫీతో అభ్యంతరకర రీతిలో ఉండగా సిస్టర్ అభయ కళ్లారా చూసింది. అప్పుడు సమయం ఉదయం 4.15 గంటలు.
తన హాస్టల్ రూమ్ నుంచి కిచెన్ లోకి వెళుతుండగా ఈ అక్రమ, అసహజ వ్యవహారం ఆమె కంటపడింది. అటు, ఫాదర్ థామస్ కొట్టూర్, నన్ సెఫీ, ఫాదర్ జోస్ పుత్రక్కయిల్ కూడా సిస్టర్ అభయను చూశారు. తమ బండారం బయటపడిపోతుందన్న ఆలోచనతో సిస్టర్ అభయపై ఫాదర్ కొట్టూరు, సెఫీ దాడి చేశారు. తలపై కర్రతో బలంగా మోదడంతో అభయ కుప్పకూలిపోయింది. చనిపోయిన ఆమెను ఫాదర్ కొట్టూర్, సెఫీ కాన్వెంట్ ఆవరణలోనే ఉన్న బావిలో పడేశారు. కానీ దీన్ని అప్పట్లో ఆత్మహత్యగా భావించారు.
స్థానిక పోలీసులు ప్రమాదవశాత్తు భావిలో పడిందని భావించగా, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా ఈ వ్యవహారంలో పొరబడ్డారు. సిస్టర్ అభయ ఆత్మహత్య చేసుకుందని రిపోర్టులో పేర్కొన్నారు. అయితే, కేరళలోని ప్రముఖ సామాజికవేత్త, మానవ హక్కుల ఉద్యమకారుడు జోమన్ పుతిన్ పురక్కళ్ ఈ ఘటనపై 1993లో న్యాయస్థానాన్ని ఆశ్రయించంతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. నాటి కేరళ సీఎం కరుణాకరన్ కూడా సీబీఐ దర్యాప్తునకు మొగ్గు చూపారు.
అప్పటినుంచి ఇప్పటివరకు సీబీఐ విచారణ కొనసాగగా, 28 ఏళ్లకు నిందితులు దోషులుగా రుజువయ్యారు. సిస్టర్ అభయది ఆత్మహత్య కాదని, ఫాదర్ థామస్ కొట్టూర్, క్రైస్తవ సన్యాసిని సెఫీ ఆమెను హత్య చేశారని సీబీఐ తేల్చింది. అయితే ఈ కేసులో మరో నిందితుడైన ఫాదర్ జోస్ పుత్రక్కయాల్ ను రెండేళ్ల కిందట న్యాయస్థానం నిర్దోషిగా పేర్కొంది. ఆయన ఈ హత్యలో పాల్గొన్నాడనేందుకు సరైన ఆధారాలు లేకపోవడంతో ఆయనను నిర్దోషిగా ప్రకటించారు.
బాధాకరమైన విషయం ఏమిటంటే... తమ కుమార్తె కేసులో న్యాయం జరగడాన్ని చూడకముందే సిస్టర్ అభయ తల్లిదండ్రులు లీలమ్మ, థామస్ చనిపోయారు. నాలుగేళ్ల కిందట వారు ఈ లోకాన్ని విడిచారు. సీబీఐ విచారణ సందర్భంగా అనేక పరిణామాలు జరిగాయి. 2008 నవంబరులో ఫాదర్ కొట్టూర్, క్రైస్తవ సన్యాసిని సెఫీ, ఫాదర్ జోస్ పుథ్రక్కయాల్ ను అరెస్ట్ చేశారు. వీరికి నార్కో పరీక్షలు నిర్వహించారు. అనేక పర్యాయాలు విచారణల అనంతరం ఫాదర్ పుత్రక్కయాల్ ను ఈ కేసు నుంచి తప్పించారు.
ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఫాదర్ కొట్టూర్, నన్ సెఫీ తీవ్రంగా ప్రయత్నించినా.... సీబీఐ ముందు వారి ఎత్తుగడలు పారలేదు. వీరిద్దరినీ తాజాగా జరిగిన విచారణలో దోషులుగా నిర్ధారించిన తిరువనంతపురం సీబీఐ కోర్టు రేపు శిక్షలు ఖరారు చేయనుంది. కాగా, సీబీఐ కోర్టు తీర్పు అనంతరం మానవ హక్కుల కార్యకర్త జోమన్ హర్షం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు సిస్టర్ అభయ ఆత్మకు శాంతి చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు, డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చనే వారికి ఈ ఉదంతం ఓ కనువిప్పు అని వ్యాఖ్యానించారు.