USA: అమెరికాలో రూ.66 లక్షల కోట్లతో కరోనా ప్యాకేజి... పచ్చజెండా ఊపిన చట్టసభలు
- కరోనాతో బాగా నష్టపోయిన అమెరికా
- ప్రత్యేక నిధికి ఓకే చెప్పిన సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్
- ట్రంప్ సంతకం అనంతరం చట్టంగా మారనున్న బిల్లు
- ప్రతి అమెరికన్ కు ఆర్థిక ప్రయోజనం
ప్రపంచంలో కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో అమెరికా ఒకటి. ఇప్పటికీ అక్కడ కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. అగ్రరాజ్యం అయినప్పటికీ కరోనా ప్రభావంతో ఆర్థికంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో, జాతీయ ఆర్థిక వ్యవస్థలకు ఊతమిచ్చేందుకు గాను రూ.66 లక్షల కోట్ల ఉద్దీపన నిధి మంజూరుకు అమెరికా చట్టసభలు అంగీకారం తెలిపాయి.
ఈ కరోనా ప్యాకేజిపై సెనేట్ లోనూ, హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ లోనూ ఓటింగ్ నిర్వహించారు. సెనేట్ లో 92-6, హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ లో 359-53 తేడాతో బిల్లుకు ఆమోదం లభించింది. త్వరలోనే ఈ బిల్లుపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయనున్నారు. ఆపై ఇది చట్టంగా రూపుదిద్దుకుంటుంది.
కాగా, ఈ కొవిడ్ ప్యాకేజి విడుదల అయితే అమెరికన్లకు ఒక్కొక్కరికి 600 డాలర్ల మేర లబ్ది చేకూరనుంది. నిరుద్యోగులకు సైతం ఈ మేరకు ఆర్థిక ప్రయోజనం లభించనుంది.