Chandrababu: ఆరు రకాల భూములపై జగన్ కన్ను పడింది... అందుకే భూ సర్వే పేరుతో హడావిడి చేస్తున్నారు: చంద్రబాబు
- పార్టీ సీనియర్లతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
- ఆస్తులు కాజేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారని ఆరోపణ
- ఆస్తులు నిత్యం చెక్ చేసుకోక తప్పదని వ్యాఖ్యలు
- ల్యాండ్ మాఫియా విజృంభిస్తోందని విమర్శలు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ సీనియర్ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరు రకాల భూములపై జగన్ కన్ను పడిందని ఆరోపించారు. ప్రజల ఆస్తులు కాజేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారని, అందుకే భూ సర్వే అంటూ హడావిడి చేస్తున్నారని విమర్శించారు.
ఇక నుంచి ఆస్తులు, భూములు నిత్యం చెక్ చేసుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. జగన్ అండ చూసుకుని వైసీపీ ల్యాండ్ మాఫియా విజృంభిస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్ని నియోజకవర్గాల్లో వందల కోట్ల భూకుంభకోణాలు వెలుగుచూస్తున్నాయని వెల్లడించారు.
అటు, ఇసుక అంశంపైనా చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. ఇసుకకు ధర నిర్ణయించి ప్రజలను దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు. రూ.1500కు లభ్యమయ్యే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు రూ.8 వేలకు కూడా దొరకడంలేదని అన్నారు.