Undavalli Arun Kumar: పోలవరం ప్రాజెక్టు విషయంలో అలసత్వం కూడదు... కేంద్రంతో రాజీ పడటం సరికాదు: ఉండవల్లి వ్యాఖ్యలు
- పోలవరం విషయంలో అలసత్వం పనికిరాదు
- పూర్తి స్థాయిలో నిర్మించకపోతే రాష్ట్రానికి తీరని నష్టం
- పునరావాస ప్యాకేజీపై రాజీ పడితే ద్రోహులుగా మిగిలిపోతారు
పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి జగన్ వ్యవహారశైలిని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తప్పుపట్టారు. పోలవరం ప్రాజెక్టు పర్యటనకు రాకుండా రైతులకు పోలీసులు నోటీసులు ఇచ్చారని... రైతులు వస్తే నష్టమేమిటని ప్రశ్నించారు. రైతులు పోలవరం ప్రాజెక్టును చూడకుండా ముఖ్యమంత్రి ఆంక్షలు విధించడం దారుణమని అన్నారు. ఇది అనాలోచిత నిర్ణయమని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందా? ఇవ్వదా? అనే ప్రశ్నకు సమాధానాన్ని కేంద్రంతో చెప్పించాలని ఉండవల్లి అన్నారు. పోలవరం ప్రాజెక్టు విభజన చట్టంలో ఉన్నా... కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రాజెక్టు విషయంలో అలసత్వం కూడదని... కేంద్రంతో రాజీ పడటం సరికాదని అన్నారు. డీపీఆర్ ప్రకారం పూర్తి స్థాయిలో ప్రాజెక్టును నిర్మించకపోతే... రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లుతుందని చెప్పారు. పునరావాస ప్యాకేజీ నిధులపై రాజీపడితే రాష్ట్రానికి ద్రోహం చేసిన వారిగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ కాబట్టి చట్టాన్ని కేంద్రం అమలు చేయడం లేదని అన్నారు.
దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రంగా ఏపీ రికార్డులకెక్కిందని విమర్శించారు. బీజేపీ అన్ని పార్టీల వంటిది కాదనే విషయాన్ని ఆ పార్టీలో చేరాలనుకునే వాళ్లు తెలుసుకోవాలని అన్నారు. ఆ పార్టీకి ఒక స్పష్టమైన ఐడియాలజీ ఉందని... సోషలిస్టులకు ఆ పార్టీ వ్యతిరేకమని చెప్పారు. వాజ్ పేయి, అద్వానీ వంటి నేతలకు ఆర్ఎస్ఎస్ ఎలా చెక్ పెట్టిందో కూడా తెలుసుకోవాలని హితవు పలికారు. పదవుల కోసం బీజేపీలో చేరకూడదని అన్నారు. ఢిల్లీలో ఇప్పుడు జరుగుతున్న గొడవ క్యాపిటలిస్టులకు, సోషలిస్టులకు మధ్య జరుగుతున్నదని చెప్పారు.