Andhra Pradesh: బ్రిటన్ నుంచి వచ్చేవారికి ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించాలని ఏపీ సర్కారు నిర్ణయం
- బ్రిటన్ లో కొత్తరకం కరోనా వైరస్
- ఇతర దేశాల్లోనూ ప్రకంపనలు
- బ్రిటన్ విమానాలపై నిషేధం విధించిన భారత్
- నెగెటివ్ వచ్చినా క్వారంటైన్ తప్పనిసరి చేసిన ఏపీ
- జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు
బ్రిటన్ లో కల్లోలం సృష్టిస్తున్న కొత్తరకం కరోనా వైరస్ ఇతర ప్రాంతాల్లో కలవరపెడుతోంది. బుధవారం అర్ధరాత్రి నుంచి ఈ నెల 31 వరకు బ్రిటన్ విమానాలను భారత్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిటన్ నుంచి నేరుగా లేక కనెక్టింగ్ ఫ్లయిట్స్ లో వస్తున్నవారిని జాగ్రత్తగా పరిశీలించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
బ్రిటన్ నుంచి ఏపీకి వచ్చే వ్యక్తులకు ఆర్టీ-పీసీఆర్ టెస్టులు తప్పనిసరి చేసింది. ఒకవేళ వారికి ఆర్టీ-పీసీఆర్ టెస్టులో నెగెటివ్ వచ్చినా 14 రోజుల హోమ్ క్వారంటైన్ విధిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ కాటమనేని స్పందిస్తూ, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చేవారిని నిశితంగా పరిశీలించాలని స్పష్టం చేశామని వెల్లడించారు.