chile: మంచుఖండాన్నీ వదలని మహమ్మారి.. 36 మందికి పాజిటివ్
- చిలీ పరిశోధన కేంద్రంలో పనిచేస్తున్న వారికి వైరస్ సంక్రమణ
- వీరిలో 26 మంది సైన్యానికి చెందినవారే
- వెనక్కి రప్పించిన ప్రభుత్వం
కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని చుట్టేసినప్పటికీ దక్షిణ ధ్రువమైన అంటార్కిటికాకు మాత్రం దూరంగా ఉంది. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఖండమైన అంటార్కిటికా పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. తాజాగా, ఈ మహమ్మారి ఇక్కడా అడుగుపెట్టింది. చిలీలోని ఓ పరిశోధనా కేంద్రంలో పనిచేస్తున్న 36 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. వీరిలో 26 మంది సైన్యానికి చెందిన వారు కాగా, మిగిలినవారు నిర్వహణ సిబ్బంది అని తెలుస్తోంది. ప్రస్తుతం వీరందరినీ వెనక్కి రప్పించినట్టు తెలుస్తోంది.
కరోనా వైరస్ నేపథ్యంలో అంటార్కిటికాకు పర్యాటకుల రాకను అక్కడి ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది. గత నెల 27న చిలీ నుంచి కొన్ని సామాన్లను అంటార్కిటికాకు చేరవేశారు. అక్కడ వైరస్ వెలుగు చూడడానికి ఇదే కారణమని భావిస్తున్నారు. అంతకంటే ముందు అక్కడి పర్యాటకులకు నిర్వహించిన పరీక్షల్లో అందరికీ నెగటివ్ అనే తేలింది. అంటార్కిటికాలో చాలా దేశాలు తమ క్యాంపులు ఏర్పాటు చేసుకుని పరిశోధనలు నిర్వహిస్తున్నాయి.