Corona Virus: భారత్‌లో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌కు అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధం
- పలు దేశాలు ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు
- వారం రోజుల్లో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగం కింద అనుమతులు?
- కథనాన్ని ప్రచురించిన రాయిటర్స్
పలు దేశాలు ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. భారత్‌లోనూ అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వారం రోజుల్లో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగం కింద అనుమతులు వచ్చే అవకాశం ఉందని తెలిసింది.
రాయిటర్స్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం... వ్యాక్సిన్‌పై భారత అధికారులు కోరిన అదనపు సమాచారాన్ని ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంస్థలు అందించాయని తెలిపింది. వ్యాక్సిన్ వినియోగానికి వచ్చే వారం అనుమతులు మంజూరయ్యే అవకాశముందని తమకు ఇద్దరు అధికారులు తెలిపినట్లు చెప్పింది.
ఇప్పటికే అనుమతుల కోసం భారత్ బయోటెక్, సీరం ఇనిస్టిట్యూట్, ఫైజర్ ఇండియా సంస్థలు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిల్లో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌కు ముందుగా అనుమతులు వచ్చే అవకాశం ఉంది.
భారత్‌కు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ దేశంలో ఈ వ్యాక్సిన్‌ను తయారుచేస్తోంది. ఫైజర్ వ్యాక్సిన్ ధర అధికంగా ఉండడంతో పాటు, దాని పంపిణీకి అతిశీతల ఉష్ణోగ్రతలు, అందుకు తగ్గ వసతులు కావాల్సి ఉంటుంది. దీంతో ఆ వ్యాక్సిన్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పట్లో దృష్టి సారించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.