Pork Gelatin: కరోనా వ్యాక్సిన్ లో పందిమాంసంతో చేసిన జెలాటిన్ ఉన్నా మాకు అభ్యంతరం లేదు: యూఏఈ ఇస్లామిక్ సంస్థ వెల్లడి

UAE Fatwa Council says no objection to pork gelatin in corona vaccine

  • ఇస్లాంలో పందిమాంసంపై నిషేధాజ్ఞలు
  • స్పందించిన యూఏఈ ఫత్వా కౌన్సిల్
  • వ్యాక్సిన్ పంపిణీకి తాము అడ్డుచెప్పబోమని స్పష్టీకరణ
  • పందిమాంసం జెలాటిన్ ఆహార పదార్థం కాదని వ్యాఖ్యలు
  • దీన్నో ఔషధంగానే భావిస్తామని వివరణ

ప్రపంచంలోని అన్ని దేశాలకు ఇప్పుడు అత్యంత అవశ్యక అంశం కరోనా వ్యాక్సిన్. ఇప్పటికే అనేక దేశాలు అత్యవసర అనుమతులతో వ్యాక్సిన్ పంపిణీ షురూ చేయగా, మరికొన్ని దేశాలు వ్యాక్సిన్ కోసం వేచిచూస్తున్నాయి. అయితే, కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ లో పందిమాంసంతో తయారైన జెలాటిన్ ఉపయోగిస్తారని వెల్లడైన నేపథ్యంలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన ఇస్లామిక్ సంస్థ యూఏఈ ఫత్వా కౌన్సిల్ కీలక వ్యాఖ్యలు చేసింది.

వ్యాక్సిన్ లో పందిమాంసంతో తయారైన జెలాటిన్ ఉన్నప్పటికీ తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి తామేమీ అడ్డుచెప్పబోమని వెల్లడించింది. ముస్లింలకు పందిమాంసం వాడకం నిషిద్ధమని ఇస్లాం చెబుతున్న నేపథ్యంలో యూఏఈ ఫత్వా కౌన్సిల్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

మరో ప్రత్యామ్నాయం లేని నేపథ్యంలో, పందిమాంసంపై ఇస్లాంలో ఉన్న నిషేధాజ్ఞలను కరోనా వ్యాక్సిన్ విషయంలో అమలు చేయలేమని ఫత్వా కౌన్సిల్ చైర్మన్ షేక్ అబ్దల్లా బిన్ బయ్యా తెలిపారు. మానవ దేహాన్ని పరిరక్షించుకోవడమే ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతాంశమని ఆయన స్పష్టం చేశారు. పందిమాంసంతో చేసిన జెలాటిన్ ఓ ఆహార పదార్థం కాదు గనుక ఎలాంటి ఇబ్బంది లేదని, దీన్ని ఔషధంగానే భావిస్తామని ఫత్వా కౌన్సిల్ వివరించింది.

కాగా, కరోనా వ్యాక్సిన్ లోనే కాదు, ఇతర వ్యాధులకు ఉపయోగించే వ్యాక్సిన్లలోనూ పందిమాంసంతో తయారైన జెలాటిన్ ను వినియోగిస్తారు. ఈ జెలాటిన్ తో ఆయా వ్యాక్సిన్లు, ఔషధాల జీవితకాలం పెరుగుతుంది. ఔషధం చెడిపోకుండా, సురక్షితంగా ఉంటుంది.

  • Loading...

More Telugu News