Mehbooba Mufti: అప్పటి వరకు నేను ఎన్నికల్లో పోటీ చేయను: మెహబూబా ముఫ్తీ
- ఆర్టికల్ 370ని జమ్మూకశ్మీర్ ప్రజలు మర్చిపోలేదు
- స్థానిక ఎన్నికల ఫలితాలతో ఈ విషయం కేంద్రానికి అర్థమై ఉంటుంది
- మేం కోల్పోయినవన్నీ సాధించడమే మా లక్ష్యం
జమ్మూకశ్మీర్ ప్రజలు ఆర్టికల్ 370ని మర్చిపోలేదని.. ఇదే విషయం స్థానిక ఎన్నికల ఫలితాలతో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి అర్థమై ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి, పీడీఎఫ్ అధినేత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. పీడీఎఫ్, నేషనల్ కాన్ఫరెన్స్ లతో కూడిన గుప్తాక్ కూటమి జిల్లా కౌన్సిల్ ఎన్నికల్లో మంచి విజయాన్ని సాధించిందని చెప్పారు.
తమ కూటమికి ప్రజలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేశారని అన్నారు. ఆర్టికల్ 370ని ప్రజలు మర్చిపోలేదని, తమ గుండెల్లో అది ఉందనే విషయం ఢిల్లీకి క్లియర్ గా అర్థమై ఉంటుందని చెప్పారు. తమ చివరి శ్వాస వరకు ఆర్టికల్ 370 కోసం పోరాడుతూనే ఉంటామని చెప్పారు. ఆర్టికల్ 370ని మళ్లీ సాధించేంత వరకు తాను ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమ కూటమిలోని పార్టీల మధ్య రాజకీయ వైరం ఉన్నప్పటికీ అన్నింటినీ పక్కన పెట్టేశామని ముఫ్తీ చెప్పారు. జమ్మూకశ్మీర్ ప్రయోజనాలే తమకు ప్రధానమని అన్నారు. తాము కేవలం ఎన్నికల గురించి మాత్రమే చర్చించుకోవడం లేదని... తమ రాష్ట్రం కోల్పోయిన వాటిని మళ్లీ సాధించడమే తమ లక్ష్యమని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా అందరం కలిసి చర్చలు జరుపుతామని... తాను మాత్రం సీఎం రేసులో ఉండబోనని స్పష్టం చేశారు.
జమ్మూకశ్మీర్ ప్రయోజనాల కోసం ప్రధాని మోదీతో తన తండ్రి చేతులు కలిపారని... అప్పుడు తమ కండిషన్లన్నింటికీ వారు ఒప్పుకున్నారని... కానీ, ప్రభుత్వం కూలిపోయిన తర్వాత వారు చేయాలనుకున్నవన్నీ చేశారని ముఫ్తీ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కూడా తనను నాలుగు సార్లు నిర్బంధించారని.. ఓటింగ్ ప్రారంభమైన తర్వాతే తనను బయటకు వదిలారని చెప్పారు.