Monkey: డబ్బు సంచిని ఎత్తుకెళ్లి రోడ్డుపై నోట్ల వర్షం కురిపించిన కోతి.. రూ. 12 వేల విలువైన నోట్ల చించివేత!

Monkey steals Rs 4 lakhs bag from a old man
  • ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో ఘటన
  • రూ. 4 లక్షలున్న చేతి సంచిని లాక్కెళ్లిన మర్కటం
  • రోడ్డుపై చెల్లాచెదురుగా నోట్లను విసిరేసిన వైనం
ఓ పెద్దాయన నుంచి చేతి సంచిని లాక్కెళ్లిన ఓ కోతి అందులోని నాలుగు లక్షల రూపాయలను రోడ్డుపై వెదజల్లింది. దాదాపు రూ. 12 వేల విలువైన నోట్లను చించి పారేసింది. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక వికాస్ భవన్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఓ వృద్ధుడు రూ. 4 లక్షల నగదు ఉన్న సంచితో బయటకు వచ్చాడు. అతడి చేతిలోని సంచిని చూసి ఆహార పదార్థాలు ఉన్నాయని భావించిన ఓ మర్కటం ఆ సంచిని లాక్కుని సమీపంలోనే ఉన్న చెట్టెక్కింది.

 తినడానికి ఏమైనా ఉన్నాయోమోనని వెతికే క్రమంలో అందులోని నోట్లను రోడ్డుపైకి వెదజల్లింది. కొన్ని నోట్లను చించిపారేసింది. ఈ హఠాత్ పరిణామానికి ఖిన్నుడైన వృద్ధుడు కోతిని అదిలించి, సంచిని తీసుకునే ప్రయత్నం చేశాడు. మరోవైపు, రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన నోట్లను చూసిన కొందరు వృద్ధుడికి తెచ్చి ఇవ్వగా, మరికొందరు అందినకాడికి జేబులో వేసుకున్నారు. ఇక, కోతి చింపేసిన నోట్ల విలువ రూ. 12 వేల వరకు ఉంటుందని వృద్ధుడు వాపోయాడు. జనాల హడావుడి చూసి బెదిరిపోయిన కోతి చివరికి సంచిని వదిలి పారిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Monkey
Uttar Pradesh
currency

More Telugu News