Saitej: నా పేరు మార్పుకు న్యూమరాలజీ కారణం కాదు: సాయితేజ్
- సాయిధరమ్ తేజ్ గా ఇండస్ట్రీకి పరిచయం
- మధ్యలో సాయితేజ్ గా పేరు మార్పు
- పిలవడానికి సులభంగా ఉంటుందని మార్చుకున్నట్టు వెల్లడి
- పెద్దపేరు రాస్తే ఇంకు వృథా అని చమత్కారం
మెగా మేనల్లుడు సాయితేజ్ 'రేయ్' చిత్రంతో కెమెరా ముందుకు వచ్చాడు. ఆ తర్వాత 'పిల్లా నువ్వులేని జీవితం', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్', 'సుప్రీం' వంటి చిత్రాలతో కొద్దికాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సాయితేజ్ నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రం రేపు (డిసెంబరు 25) ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర సంగతులు పంచుకున్నాడు. మొదట్లో సాయితేజ్ పేరు సాయిధరమ్ తేజ్ అని తెలిసిందే. మధ్యలో తన పేరును సాయితేజ్ గా మార్చుకున్నాడు. అందుకు గల కారణాన్ని వివరించాడు.
సాయిధరమ్ తేజ్ అని పిలవడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి సాయితేజ్ అంటూ సింపుల్ గా ఉండేలా మార్చుకున్నానని తెలిపాడు. అంతేతప్ప, తన పేరు మార్పుకు న్యూమరాలజీ (సంఖ్యాశాస్త్రం), ఇతర నమ్మకాలేవీ కారణం కాదని స్పష్టం చేశాడు. కావాలంటే సాయిధరమ్ తేజ్ అని పిలుచుకోవచ్చని అన్నాడు. అయినా, పోస్టర్ లో అంతపెద్ద పేరు రాస్తే సిరా వృథా అవుతుందని, సాయితేజ్ అని రాస్తే సిరా ఆదా అవుతుంది కదా? అని చమత్కరించారు. స్కూల్లోనూ తనను సాయి అని కొందరు, సాయితేజ్ అని కొందరు పిలిచేవారని వెల్లడించాడు.