Vishnu Vardhan Reddy: ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఏ పార్టీని బ్రతికించాలని చూస్తున్నారో అందరికీ తెలుసు: ఉండవల్లిపై విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్

Vishnuvardhan Reddy slams former MP Undavalli Arun Kumar
  • ఊసరవెల్లిలా మారొద్దంటూ ఉండవల్లికి హితవు
  • ఎవరికోసం మాట్లాడుతున్నారో అందరికీ తెలుసని వెల్లడి
  • దానివెనకున్న రహస్యం కూడా ఎరుకేనన్న విష్ణువర్ధన్ రెడ్డి
  • మీ సలహాలు ఎవరికి కావాలని వ్యాఖ్యలు
రాష్ట్ర విభజన అనంతర పరిస్థితుల్లో దాదాపు మౌనంగా ఉండిపోయిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల కాలంలో తరచుగా మీడియా ముందుకు వస్తున్నారు. రాష్ట్ర పరిణామాలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. అయితే ఉండవల్లి తీరును బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తప్పుబట్టారు. ఉండవల్లి గారు, మీరు ఊసరవెల్లిలా మారొద్దంటూ హితవు పలికారు. మీరు ఎవరి కోసం మాట్లాడుతున్నారో... ఏ పార్టీని ఆంధ్రరాష్ట్రంలో బ్రతికించాలని తాపత్రయపడుతున్నారో అందరికీ తెలుసని స్పష్టం చేశారు. దాని వెనకున్న రహస్యం కూడా అందరికీ తెలుసని పేర్కొన్నారు.

ఇక, బీజేపీలో ఎందుకు చేరాలి? ఎందుకు చేరకూడదు? అనే అంశాలు చేరేవాళ్లకు తెలుసని, మీ భ్రమ కాకపోతే, రాజకీయ అస్త్రసన్యాసం చేసిన మీలాంటి వారి సలహాలు వారు ఎందుకు తీసుకుంటారని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు.

"ఆర్ఎస్ఎస్ గురించి మీరు చాలా విమర్శలు చేశారు.  మీరు నమ్మిన కాంగ్రెస్, మీరు ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నెహ్రూ గారు 1963 రిపబ్లిక్ డే వేడుకలకు ఆర్ఎస్ఎస్ ను ఆహ్వానించారు. చరిత్ర అంతా మీకే తెలిసినట్టు 95 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆర్ఎస్ఎస్ గురించి మీరు ఇవాళ అవహేళన చేస్తూ మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో నేడు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి అత్యున్నత పదవుల్లో దేశం కోసం పనిచేస్తున్నారు. మేధావులు కదా మీరు... ఈ చరిత్ర తెలియదా? తెలియకపోవచ్చులే... మనం మేధావి ముసుగులో ఉన్నాం కదా" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.
Vishnu Vardhan Reddy
Undavalli Arun Kumar
BJP
Andhra Pradesh

More Telugu News