Google: లక్ష కోట్ల నిమిషాల వీడియో కాల్స్: గూగుల్ ను తెగ వాడేశారు
- కరోనా లాక్ డౌన్ తో భారీగా పెరిగిన వినియోగం
- గూగుల్ డ్యుయో, మీట్ లలో విరివిగా వీడియో కాల్స్
- వచ్చే ఏడాది మార్చి నుంచి జీమెయిల్ తో కాల్స్ ఉచితం
ఉత్తరాలు.. ఎక్కడో దూరంగా ఉన్న కుటుంబసభ్యులు, స్నేహితులతో వ్యక్తులను కలిపే వారధి. కానీ, అది ఒకప్పుడు. ఇప్పుడు కాలం మారింది. సాంకేతికత పెరిగింది. ఉత్తరాల నుంచి స్మార్ట్ ఫోన్ల దాకా వచ్చేశాం. సమస్తం అరచేతిలోనే ఉంటోంది. ఒట్టి మాటలేం ఖర్మ.. చూసేయాలనిపిస్తే డైరెక్ట్ గా వీడియో కాల్స్ చేసేస్తున్నాం. కరోనా తెచ్చిన లాక్ డౌన్లు వీడియో కాల్స్ ను మరింత పెంచాయి. ఈ ఏడాది రికార్డ్ సృష్టించాయి.
ఒకటి కాదు.. రెండు కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా లక్ష కోట్ల నిమిషాలకుపైగా వీడియో కాల్స్ మాట్లాడారట. అంటే ఒక్క ఏడాదిలో అది 1,800 కోట్ల గంటలకు సమానం. అదీ ఒక్క గూగుల్ లోనే అంటే అతిశయోక్తి అనిపించకమానదు. ఈ విషయాన్ని స్వయంగా గూగుల్ వెల్లడించింది. గూగుల్ డ్యుయో, గూగుల్ మీట్ సేవలను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు భారీగా వినియోగించుకున్నారని పేర్కొంది.
వచ్చే ఏడాది మార్చి 31 నుంచి జీమెయిల్ తో అనుసంధానమై గూగుల్ మీట్ సేవలను ఉచితంగా పొందొచ్చని సంస్థ తెలిపింది. ఈ ఏడాదే కొత్తగా మీట్ ట్యాబ్ ను జీమెయిల్ లో పెట్టినట్టు చెప్పింది. దాంతో పాటు నెస్ట్ హబ్ మ్యాక్స్, క్రోమ్ క్యాస్ట్ లలోనూ మీట్ ను అందుబాటులోకి తెచ్చామని, ఎలాంటి చీకూ చింతా లేకుండా హ్యాండ్స్ ఫ్రీ కాల్స్ మాట్లాడుకోవచ్చని గూగుల్ డ్యుయో, మీట్ ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ డైరెక్టర్ డేవ్ సిట్రాన్ చెప్పారు. గోప్యత, భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని అన్నారు. ప్రతి ఒక్కరి సమాచారం రహస్యంగానే ఉంటుందన్నారు.
కాగా, రోజూ గూగుల్ లో సగటున 10 కోట్ల మంది కొత్త వినియోగదారులు చేరుతున్నారు. అయితే, ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రికార్డు స్థాయిలో రోజూ 23.5 కోట్ల మంది కొత్త వినియోగదారులు అందులో నమోదయ్యారు.