Rajinikanth: అపోలో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్.. ఆందోళనలో అభిమానులు!
- బీపీ సమస్యలతో ఆసుపత్రిలో చేరిక
- కరోనా లక్షణాలు లేవని నిర్ధారణ
- బీపీ స్థాయుల్లో తీవ్ర హెచ్చుతగ్గులు
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయన హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో రజనీకి తోడుగా ఆయన కుమార్తె ఐశ్వర్య ఉన్నారు. చికిత్సలో ఆయనకు కరోనా నెగెటివ్ అని తేలింది.
గత కొన్ని రోజులుగా ఆయన సినిమా 'అన్నాత్తే' షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ప్రొడక్షన్ సభ్యులకు టెస్టులు నిర్వహించగా ఎనిమిది మందికి కరోనా సోకినట్టు తేలింది.
ఇప్పుడు రజనీ అస్వస్థతకు గురయ్యారని తేలడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కాసేపటి క్రితం రజనీ ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు.
'ఈ ఉదయం రజనీకాంత్ ఆసుపత్రిలో చేరారు. గత 10 రోజులుగా ఆయన హైదరాబాదులో షూటింగ్ లో పాల్గొంటున్నారు. 22వ తేదీన సెట్స్ లో ఉన్న కొందరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అదే రోజున చేసిన టెస్టులో రజనీకి నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ అప్పటి నుంచి ఆయన స్వీయ నిర్బంధంలో ఉన్నారు. వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు.
రజనీకాంత్ లో కరోనా లక్షణాలు లేనప్పటికీ... బీపీ స్థాయుల్లో భారీ హెచ్చుతగ్గులు ఉన్నాయి. బీపీ పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చేంత వరకు ఆయనను వైద్య బృందం పర్యవేక్షిస్తుంది. బీపీ మినహా ఆయనలో ఇతర ఆరోగ్య సమస్యలు లేవు' అని బులెటిన్ లో వైద్యులు తెలిపారు.
మరోవైపు, రజనీ అస్వస్థతకు గురయ్యారని తెలియగానే, ఆయన అభిమానులు అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు.