Auto: అడ్డదిడ్డమైన డ్రైవింగ్ పై నిలదీసినందుకు.. బైక్ ను వేగంగా ఢీకొట్టిన ఆటోడ్రైవర్
- అదృష్టవశాత్తూ బయటపడిన బాధితుడు
- ముంబైలోని గోవాండిలో ఘటన
- ఆటో నెంబర్ ఆధారంగా నిందితుడి అరెస్ట్
- హత్యాయత్నం కింద కేసుల నమోదు
ఒక్కోసారి పక్కవారితో పెట్టుకున్న చిన్న చిన్న గొడవలు ఊహించని ఘటనలకు దారి తీస్తాయి. అలాంటిదే ముంబైలో ఓ వ్యక్తికి వారం కిందట జరిగింది. ట్రాఫిక్ లో ఆటోను అడ్డదిడ్డంగా నడిపావని నిలదీసిన పాపానికి ఓ వ్యక్తిని ఆ ఆటో డ్రైవర్ వేగంగా వచ్చేసి ఢీ కొట్టేశాడు. దీంతో వాహనాలు ఎక్కువగా వస్తున్న ఆ రోడ్డు మధ్యలో అతడు పడిపోయాడు. అదృష్టవశాత్తూ అతడికి ప్రాణాపాయం సంభవించలేదు. ముంబైలోని గోవాండీలో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో వైరల్ అయింది.
శివాజీనగర్-దేవ్ నార్-బైంగాన్వాడీ మధ్య ఉన్న ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆటో డ్రైవర్ కు, బైక్ మీద వెళుతున్న వ్యక్తికి వాగ్వాదం జరిగింది. సిగ్నల్ పడడంతో మళ్లీ ఎవరి దారిన వాళ్లు వెళుతున్నారు. అయితే, నిలదీశాడన్న అక్కసుతో ఆ ఆటోడ్రైవర్.. వేగంగా ఆటోను నడిపి ముందు వెళుతున్న బైక్ ను ఢీకొట్టాడు. కిందపడిపోయిన ఆ వ్యక్తి కాసేపు బిత్తరపోయి చూశాడు. వీడియో పోస్ట్ చేసిన వ్యక్తులు.. ఇలాంటి ఆటో డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఘటనకు సంబంధించిన వీడియోను కొందరు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఆటో నెంబర్ ఆధారంగా ఘటనకు పాల్పడింది రఫీక్ నగర్ కు చెందిన 34 ఏళ్ల సల్మాన్ సయ్యద్ గా గుర్తించారు. గురువారం అతడిని అరెస్ట్ చేశారు. బాధితుడు కిషోర్ కార్దక్ అని పోలీసులు చెప్పారు. నిందితుడిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశామన్నారు.