V Hanumantha Rao: రేవంత్‌కు పీసీసీ ఇస్తే....కాంగ్రెస్ పార్టీని వదిలేస్తాను: వి.హనుమంతరావు
- టీపీసీసీ చీఫ్ గా రేవంత్ ఖరారయినట్టు సమాచారం
- కోమటిరెడ్డి, జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ గా పనికిరారా? అని ప్రశ్నించిన వీహెచ్
- ఢిల్లీని రేవంత్ మేనేజ్ చేస్తున్నారని వ్యాఖ్య
టీపీసీసీకి కొత్త సారథి దాదాపు ఖరారయ్యారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించేందుకు అధిష్ఠానం మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే తాను కాంగ్రెస్ పార్టీలో ఉండబోనని అన్నారు.
తాను మాత్రమే కాదని... చాలా మంది పార్టీని వీడతారని చెప్పారు. ఎవరి దారిని వారు చూసుకుంటారని తెలిపారు. పార్టీ కోసం ఎంతో కాలంగా పని చేస్తున్న కోమటిరెడ్డి, జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ గా పనికిరారా? అని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశంలో ఉండి ఆ పార్టీని ఖతం చేసిన రేవంత్ రెడ్డి... ఇప్పుడు కాంగ్రెస్ ను కూడా నాశనం చేస్తారని చెప్పారు.
రేవంత్ రెడ్డి ఢిల్లీని కూడా మేనేజ్ చేస్తున్నారని వీహెచ్ మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల్లో 48 సీట్లను తీసుకున్న రేవంత్ రెడ్డి ఎన్నింటిని గెలిపించారని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయని ప్రశ్నించిన వీహెచ్... దీనికి సంబంధించి సీబీఐకి లేఖ రాస్తానని చెప్పారు. వీహెచ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి.