Nepal: నేపాల్ రాజకీయ సంక్షోభం వాళ్ల అంతర్గత వ్యవహారం.. వాళ్లే పరిష్కరించుకోవాలి: భారత విదేశాంగ శాఖ
- మంచి కోరుకునే పొరుగు దేశంగా అండగా ఉంటామని హామీ
- ఇండియా ప్రాజెక్టులపై అక్కడి నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆసక్తి చూపుతుందంటున్న అధికారులు
- రాజకీయ సంక్షోభంపై రంగంలోకి చైనా.. నేపాల్ అధ్యక్షుడితో దౌత్యవేత్త భేటీ
నేపాల్ రాజకీయ సంక్షోభంలోకి దూరాలని చైనా ప్రయత్నిస్తోంది. దాని ద్వారా లబ్ధి పొందాలని చూస్తోంది. అయితే, మన దేశం మాత్రం ఆ దేశ రాజకీయ పరిస్థితులకు దూరంగా ఉంటోంది. నేపాల్ పార్లమెంట్ ను ఆ దేశ ప్రధానమంత్రి కేపీ ఓలి రద్దు చేయడం.. ఆ దేశ అంతర్గత వ్యవహారమని వ్యాఖ్యానించింది.
మంచిని కోరుకునే పొరుగు దేశంగా నేపాల్ , ఆ దేశ ప్రజలకు ఎప్పుడూ అండగా నిలుస్తామని విదేశాంగ శాఖ ప్రకటించింది. వారు శాంతివైపు అడుగులు వేయాలని, సుఖసంతోషాలతో జీవిస్తూ అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నామని చెప్పింది. వారి ప్రజాస్వామ్య పద్ధతుల మేరకు ఆ సమస్యను వారే పరిష్కరించుకోవాలని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు.
కాగా, ఇప్పటికే రెండుగా చీలిపోయిన నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్ సీపీ).. అక్కడ మన దేశం చేపడుతున్న అభివృద్ధి పనులపై మొగ్గు చూపే అవకాశాలున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. విదేశాంగ కార్యదర్శి హర్ష శృంగాల, వాణిజ్య, విద్యుత్ శాఖ కార్యదర్శులు అక్కడి ప్రాజెక్టులపై ఆన్ లైన్ లో సమీక్షించారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టులను ఎన్ సీపీ ముందుకు తీసుకెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు.
కొవిడ్ 19 తర్వాత ఇటీవల కాలాపానీ సరిహద్దులపై నేపాల్ కొత్త వివాదం రేపిన సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మునుపుటంత కాకపోయినా.. అభివృద్ధి పనులు మాత్రం కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు.
కాగా, నేపాల్ రాజకీయ సంక్షోభంలోకి చైనా నేరుగా రంగంలోకి దిగింది. నేపాల్ అధ్యక్షురాలు బీడీ భండారి, పీకే దహల్ ప్రచండతో నేపాల్ లో చైనా దౌత్యవేత్త హ్యూ యాంఖీ సమావేశమయ్యారు. ఎన్ సీపీ చీలిపోకుండా ఉండేందుకే హ్యూ సమావేశమవుతున్నారని దహల్ కు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.