Raghunandan Rao: మార్చిలో కేటీఆర్ ను సీఎం చేయాలనే ప్లాన్ లో ఉన్నారు: రఘునందన్ రావు
- కేసీఆర్ ఫ్యామిలీకి ఓటర్లు బుద్ధి చెప్పారు
- వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయి
- 2023లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ కు పట్టాభిషేకం జరగబోతోందనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. కేటీఆర్ సీఎం కాబోతున్నారంటూ పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్ రావు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ కు ఆరోగ్యం సరిగా లేదని... ఈ కారణంగానే వచ్చే మార్చిలో తన కుమారుడు కేటీఆర్ కు పట్టాభిషేకం చేసే యోచనలో కేసీఆర్ ఉన్నారని చెప్పారు. నిజామాబాద్ లో కవితకు, దుబ్బాకలో హరీశ్ రావుకు, జీహెచ్ఎంసీలో కేటీఆర్ కు ప్రజలు ఓట్ల ద్వారా బుద్ధి చెప్పారన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని రఘునందన్ రావు అన్నారు. రైతులను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయని విమర్శించారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు.