CPM: అతి చిన్న వయసులోనే మేయర్ పదవి.. కేరళ అమ్మాయి ఘనత!
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్యా రాజేంద్రన్ విజయం
- మేయర్ పదవికి ఆమె పేరును ప్రతిపాదించిన సీపీఎం
- నేడు అధికారిక ప్రకటన
- బీఎస్సీ మ్యాథ్స్ రెండో ఏడాది చదువుతున్న ఆర్య
కేరళ రాజధాని తిరువనంతపురానికి చెందిన 21 ఏళ్ల ఆర్యా రాజేంద్రన్ రికార్డులకెక్కబోతున్నారు. బీఎస్సీ మ్యాథ్స్ రెండో ఏడాది చదువుతున్న ఆమె దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన మేయర్‌గా చరిత్ర సృష్టించబోతున్నారు. ఎలక్ట్రీషియన్ కుమార్తె అయిన ఆమె కుటుంబం మొత్తం సీపీఎం మద్దతుదారులే.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదవన్‌ముగల్ వార్డు నుంచి గెలుపొందిన ఆమె పేరును తిరువనంతపురం నగర కార్పొరేషన్ మేయర్ పదవికి పార్టీ సిఫారసు చేసింది. ఈ ఎన్నికల్లో వంద వార్డులకు గాను ఎల్డీఎఫ్ 51 స్థానాల్లో విజయం సాధించింది.
ఆల్ విమెన్ ఆల్ సెయింట్స్ కాలేజీలో చదువుతున్న ఆర్యా రాజేంద్రన్ తండ్రి కేఎం రాజేంద్రన్ ఎలక్ట్రీషియన్ కాగా, తల్లి శ్రీలత ఎల్‌ఐసీ ఏజెంట్. ఆమె సోదరుడు అరవింద్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చదివి ప్రస్తుతం విదేశంలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరంతా సీపీఎం మద్దతుదారులే. కాగా, మేయర్ పదవికి ఆర్యాను ఎంపిక చేస్తూ పార్టీ నేడు అధికారికంగా ప్రకటించనుంది.