Narendra Modi: మోదీ ప్రధానిగా ఉండగా ఏ కార్పొరేట్ శక్తీ రైతుల నుంచి భూమిని లాక్కోలేదు: అమిత్ షా
- ఎంఎస్‌పీ కొనసాగుతుంది, మండీలను మూసివేయబోం
- రైతు చట్టాలపై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి
- రైతు సంక్షేమానికే మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనపై స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై మరోమారు విరుచుకుపడ్డారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ ప్రధానిగా ఉండగా రైతులకు అన్యాయం జరగబోదని, ఏ కార్పొరేట్ శక్తీ వారి నుంచి భూములు లాక్కోలేదని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధర కొనసాగుతుందని, మండీలను మూసివేయబోమని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్లోని ఏ ప్రొవిజన్ అయినా రైతులకు వ్యతిరేకంగా ఉందని రైతు సంఘాలు భావిస్తే చర్చించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎంఎస్‌పీపై ఒకటిన్నర రెట్లు అధికంగా ఇవ్వాలంటూ ఏళ్లుగా రైతులు చేస్తున్న డిమాండ్‌ను మోదీ ప్రభుత్వం నెరవేర్చిందని, 2014-19 మధ్య దీనిని అమలు చేసిందని అమిత్ షా గుర్తు చేశారు. ఎంఎస్‌పీ కొనసాగుతుందని, మండీలను మూసివేయబోమని మరోమారు స్పష్టం చేస్తున్నట్టు చెప్పిన షా.. రైతుల సంక్షేమానికే మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు.