Mumbai: ముంబై మురికివాడ ధారావిలో తొలిసారి.. గత 24 గంటల్లో ఒక్క కేసూ లేదు!
- కరోనా కట్టడిలో ఆదర్శంగా నిలిచిన ధారావి
- ప్రస్తుతం 12 యాక్టివ్ కేసులు మాత్రమే
- ముంబైలో నిన్న 596 కేసుల నమోదు
ముంబై మురికివాడ ధారావిలో తొలిసారి గత 24 గంటల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కరోనా తొలి రోజుల్లో కరోనా మహమ్మారితో ధారావి వణికిపోయింది. ఇక్కడ ఏప్రిల్ 1న తొలి కరోనా కేసు నమోదు కాగా, ఇప్పటి వరకు 3,788 మంది వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం ఇక్కడ 12 కేసులు యాక్టివ్గా ఉండగా, అందులో 8 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. నలుగురు మాత్రం కొవిడ్ కేంద్రంలో చికిత్స పొందుతున్నారు.
ధారావిలో కరోనా కట్టడికి చేసిన కృషికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా ప్రశంసలు లభించాయి. ట్రేసింగ్, ట్రాకింగ్, టెస్టింగ్ పద్ధతిలో ప్రజల భాగస్వామ్యంతో ఇక్కడ కరోనాకు ముకుతాడు వేయగలిగారు. కాగా, జులై 26న చివరిసారి రెండు కరోనా కేసులు వెలుగు చూడగా, నెల రోజుల తర్వాత మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. తాజాగా, గత 24 గంటల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.
మరోవైపు, కరోనాతో వణికిపోయిన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మాత్రం నిన్న కొత్తగా 596 కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా ఇప్పటి వరకు ఇక్కడ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,89,800కి పెరిగింది. అలాగే, నిన్న 11 మంది కరోనాకు బలికాగా 377 మంది కోలుకున్నారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ముంబైలో ఇప్పటి వరకు 2,69,672 మంది కోలుకున్నారు. 11,056 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 8,218 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.