Pawan Kalyan: పవన్ ముందు ఓ రైతు కూలీ వెలిబుచ్చిన ఆవేదనను ట్వీట్ చేసిన జనసేన
- నివర్ తుపానుతో రాష్ట్రంలో భారీగా పంట నష్టం
- తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన పవన్
- కృష్ణా జిల్లా రైతాంగానికి పరామర్శ
- పామర్రు వద్ద సురేశ్ అనే రైతుకూలీతో మాటామంతీ
- రైతు బాగుంటేనే అందరూ బాగుంటారన్న సురేశ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవల నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో పర్యటించి తుపాను కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఆ సందర్భంగా పవన్ కంకిపాడు నుంచి అవనిగడ్డ వెళుతుండగా మార్గమధ్యంలో పామర్రు వద్ద ఇద్దరు వ్యక్తులను గుర్తించి ఆగారు. వారితో మాట్లాడారు. వారు ఓ పొలంలో మినుములు చల్లే పనికి వచ్చామని చెప్పారు. ఆ ఇద్దరిలో ఒకరైన చాట్ల సురేశ్ అనే వ్యక్తి పవన్ తో తమ ఆవేదనను పంచుకున్నారు.
ఆ సమయంలో సురేశ్ ఏంచెప్పాడో జనసేన పార్టీ ఇప్పుడు ట్వీట్ రూపంలో వెల్లడించింది. తుపాను కారణంగా రైతులే కాదు కూలీలు కూడా నష్టపోయారని, రైతులతో పాటు కూలీల బతుకులు కూడా రోడ్డునపడ్డాయని సురేశ్ తెలిపాడు. రైతు బాగుంటేనే అందరూ బాగుంటారని పేర్కొన్నాడు.
పొలంలో నీటమునిగి కుళ్లిపోయిన వరి కంకులను పవన్ కు చూపించి, ఇంత దారుణంగా పంట నాశనం అయితే రైతు బతికేదెలా అని ఆక్రోశించాడు. తమకు వ్యవసాయ పనులే ప్రధాన ఆధారమని, తమలాంటి వాళ్ల గురించి పట్టించుకునేదెవరు అని ఆవేదన వెలిబుచ్చాడు. రైతు కూలీలను ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు రోడ్డున పడే పరిస్థితులు వస్తాయని సురేశ్ జనసేనానికి స్పష్టం చేశాడు.