AAI: కరోనా వ్యాక్సిన్ల రవాణా ఏర్పాట్లు: పూణేలో ఆ రెండున్నర ఎకరాలు ఇవ్వాలని ఐఏఎఫ్ కు ఏఏఐ వినతి

AAI seeks 2 acres in Pune form IAF

  • బదులుగా భూమివ్వాలన్న ఐఏఎఫ్
  • టీకా సరఫరాకు విమానాశ్రయాల్లో చకచకా ఏర్పాట్లు
  • ఢిల్లీలో ‘ప్రాజెక్ట్ సంజీవని’ పేరుతో శీతల గిడ్డంగులు
  • హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేకమైన జోన్లు
  • చిన్న విమానాశ్రయాల్లోనూ అవసరమైన వసతులు

దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. టీకాను వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేలా విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు వేగంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసే వ్యాక్సిన్ల రవాణా కోసం పూణే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆనుకుని వున్న రెండున్నర ఎకరాల భూమిని ఇవ్వాల్సిందిగా భారత వాయుసేన (ఐఏఎఫ్)ను భారత విమానాశ్రయాల అధీకృత సంస్థ (ఏఏఐ) కోరింది.  

ఐఏఎఫ్ కు చెందిన ఆ భూమిని పూణే విమానాశ్రయానికి ఇవ్వాల్సిందిగా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నామని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. భూమికి బదులు భూమి ఇవ్వాలంటూ ఐఏఎఫ్ అడిగిందన్నారు. అందుకు ఏఏఐ అంగీకరించిందన్నారు. సీరమ్ నుంచి చాలా పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లను సరఫరా చేయాల్సి ఉన్నందున, అందుకు కావాల్సిన అవసరాలు, ఏర్పాట్లేంటో సంస్థతో చర్చిస్తూనే ఉన్నామన్నారు.

మరోపక్క, పూణే నుంచి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ మీదుగా వ్యాక్సిన్ల రవాణాకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇప్పటికే ‘ప్రాజెక్ట్ సంజీవని’ పేరుతో శీతల గిడ్డంగులను ఏర్పాటు చేశారు. రెండు ట్రిప్పుల చొప్పున రోజూ 54 లక్షల వ్యాక్సిన్ సీసాలను సరఫరా చేసే సామర్థ్యం విమానాశ్రయ కార్గో టెర్మినల్స్ కు ఉంది. ఏటా దాదాపు లక్ష టన్నుల వరకు సామగ్రిని విమానాశ్రయం డీల్ చేయగలదని విమానాశ్రయ ప్రతినిధి చెప్పారు. కార్గో టెర్మినల్ వ్యవహారాలను టర్కీకి చెందిన సెలెబీ అనే సంస్థ నిర్వహిస్తోంది.

వ్యాక్సిన్ల రవాణా కోసం విమానాలకు ప్రత్యేక, అనుకూల సమయాలను కేటాయిస్తామని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు చెప్పారు. వ్యాక్సిన్లకు అవసరమైన ఉష్ణోగ్రతలను అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
 
హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఔషధ రవాణా కోసం ప్రత్యేకమైన జోన్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. మైనస్ 20 నుంచి మైనస్ 25 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను నియంత్రించే గోదాములను కట్టారు. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ కొవ్యాగ్జిన్, రష్యా-డాక్టర్ రెడ్డీస్ స్పుత్నిక్ వ్యాక్సిన్ల రవాణాకు ఎయిర్ పోర్టు కీలకంగా మారనుంది.

చిన్న చిన్న విమానాశ్రయాల్లోనూ శీతల గొలుసుకట్టు వసతులను ఏర్పాటు చేస్తున్నట్టు ఏఏఐ చైర్మన్ అరవింద్ శర్మ తెలిపారు. విదేశాల నుంచి వచ్చే వ్యాక్సిన్లన్నీ అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచే వెళ్తాయని, అక్కడి నుంచి చిన్న పట్టణాలకు రవాణా జరుగుతుందని చెప్పారు. కాబట్టి ఆ పట్టణాల్లోని చిన్న విమానాశ్రయాల్లోనూ మౌలిక వసతుల కల్పనకు పూనుకున్నామని వివరించారు. ఇప్పటికే ఆ వసతులున్న చోట వాటిని మరింత ఆధునికీకరిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News