V Hanumantha Rao: రెండు వర్గాలుగా చీలిపోయిన తెలంగాణ కాంగ్రెస్!
- టీకాంగ్రెస్ లో చిచ్చు రేపుతున్న పీసీసీ చీఫ్ పదవి
- రేవంత్ వైపు మొగ్గుచూపుతున్న అధిష్ఠానం
- వ్యతిరేకిస్తున్న పార్టీ సీనియర్లు
టీపీసీసీ చీఫ్ పదవి కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవడంతో పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కొత్త సారథి కోసం కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తును మొదలుపెట్టింది.
అయితే ఈ పదవిని ఆశిస్తున్న వారిలో పలువురు కీలక నేతలు ఉండటంతో పార్టీలో అంతర్గతంగా అసంతృప్త జ్వాలలు రేగుతున్నాయి. పార్టీ అధిష్ఠానం ఎంపీ రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వస్తున్న తరుణంలో... సీనియర్ నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రేవంత్ రెడ్డి వర్గం వర్సెస్ రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గంగా తయారైంది.
రేవంత్ పేరు బయటకు రాగానే సీనియర్ నేత వి.హనుమంతరావు తనదైన శైలిలో ప్రతిస్పందించారు. పార్టీలో ఎంతోమంది సీనియర్లు, పార్టీ కోసం ఎంతో కాలంగా పని చేసిన నాయకులు ఉండగా... రేవంత్ వైపు ఎలా మొగ్గు చూపుతారని అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ కు పీసీపీ పగ్గాలను అప్పగిస్తే... మరుక్షణమే తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తానని హెచ్చరించారు. ఠాగూర్ డబ్బులకు అమ్ముడు పోయాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ సీరియస్ అయ్యారు. రాష్ట్ర కార్యదర్శి బోస్ రాజును ఈ అంశంపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో వీహెచ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన మీడియా క్లిప్పింగులు, పేపర్ క్లిప్పింగులను ఠాగూర్ కు బోస్ రాజు పంపించారు. ఈ నేపథ్యంలో వీహెచ్ కు పార్టీ పరంగా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.