Parasuram: సరిహద్దుల్లో తెలంగాణ జవాను మృతి... ఎలా చనిపోయాడో చెప్పని అధికారులు!
- 2004లో ఆర్మీకి ఎంపికైన పరశురాం
- పలు రాష్ట్రాల్లో బాధ్యతల నిర్వహణ
- ప్రస్తుతం లేహ్ లో నాయక్ హోదాలో విధులు
- కుటుంబ సభ్యులకు మరణ వార్త చెప్పిన అధికారులు
సరిహద్దుల్లో మరో తెలంగాణ జవాను మృతి చెందాడు. అతని మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం గువ్వనికుంట తండాకు చెందిన పరశురాం 2004లో ఆర్మీకి ఎంపికయ్యాడు. అనేక రాష్ట్రాల్లో బాధ్యతలు నిర్వర్తించిన 35 ఏళ్ల పరశురాం ప్రస్తుతం లేహ్ ప్రాంతంలో నాయక్ ర్యాంకులో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు సైనికాధికారులు పరశురాం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, మరణవార్త చెప్పారు. అయితే, పరశురాం ఎలా చనిపోయాడన్నది మాత్రం వారు చెప్పలేదు. జవాను మృతి నేపథ్యంలో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు రాజకీయ నేతలు పరశురాం కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. పరశురాం మృతదేహాన్ని అధికారులు గువ్వనికుంట తండా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.