Sunil Gavaskar: నేను రహానే కెప్టెన్సీపై వ్యాఖ్యానిస్తే ప్రజలు ఏమంటారో తెలుసా..?: గవాస్కర్
- మెల్బోర్న్ టెస్టు తొలిరోజు భారత్ ఆధిపత్యం
- రహానే కెప్టెన్సీపై సర్వత్రా ప్రశంసలు
- తాను పొగిడితే ముంబయి ట్యాగ్ తగిలిస్తారని సన్నీ వెల్లడి
- ముంబయి పక్షపాతినంటారని వ్యాఖ్యలు
రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీలో ఆసీస్ తో రెండో టెస్టులో అజింక్యా రహానే టీమిండియాకు నాయకత్వం వహిస్తున్నాడు. మొదటి రోజు ఆటలో ఆసీస్ 195 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లు బుమ్రా, అశ్విన్, సిరాజ్, జడేజా ఆకట్టుకునే బౌలింగ్ ప్రదర్శన చేశారు. ఈ నేపథ్యంలో, రహానే తన నాయకత్వ పటిమ చూపి బౌలర్లను సమర్థవంతంగా వినియోగించుకున్న తీరు తొలి రోజు ఆటలో కీలకంగా నిలిచింది. దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు.
రహానే కెప్టెన్సీ గురించి తాను ఎక్కువగా మాట్లాడదలచుకోలేదని స్పష్టం చేశారు. ఒకవేళ తాను రహానే నాయకత్వ లక్షణాల గురించి మాట్లాడితే.... ముంబయికి చెందిన వాడు కాబట్టే పొగిడానని ప్రజలు తన గురించి మాట్లాడుకుంటారని వివరించారు. ముంబయి క్రికెటర్లను తాను అన్ని వేళలా సమర్థిస్తుంటానని ప్రజలు భావిస్తుంటారని తెలిపారు. రహానే, గవాస్కర్ ఇద్దరూ ముంబయికి చెందినవారేనన్న విషయం తెలిసిందే.
అటు, మెల్బోర్న్ లో భారత్ తొలిరోజు ముగించిన తీరు పట్ల టీమిండియా మాజీలు వీవీఎస్ లక్ష్మణ్, వీరేందర్ సెహ్వాగ్ స్పందించారు. వారిద్దరూ కూడా రహానే సారథ్యాన్ని ప్రశంసించారు. రహానే కెప్టెన్సీ బాగుందని లక్ష్మణ్ పేర్కొనగా, అద్భుతమైన బౌలింగ్ మార్పులు, తెలివైన ఫీల్డింగ్ మోహరింపులతో రహానే అలరించాడని సెహ్వాగ్ కొనియాడాడు.