Pakistan: పాకిస్థాన్ కు చైనా డ్రోన్లు... వాటి ఆటలు మన వద్ద సాగవన్న భారత్
- పాక్ కు 50 డ్రోన్లు అందించిన చైనా
- పాక్ ను భారత్ పైకి ఎగదోసే యత్నం!
- నియంత్రిత గగనతలంలో ఆ డ్రోన్లు పనిచేయవన్న భారత్
- గీత దాటితే కూల్చేస్తామని స్పష్టీకరణ
పాకిస్థాన్, చైనా ఎంతటి మిత్రదేశాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ రెండు దేశాల ప్రధాన జెండా భారత్ ను దెబ్బతీయడమే! ఈ క్రమంలో పాక్ కు చైనా తాజాగా 50 వింగ్ లూంగ్-2 డ్రోన్లను అందించింది. సరిహద్దుల్లో భారత్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తుండడాన్ని భరించలేకపోతున్న చైనా... వింగ్ లూంగ్-2 డ్రోన్లు అందించడం ద్వారా పాక్ ను భారత్ పై ఉసిగొల్పాలని ప్రయత్నిస్తోంది.
కొంతకాలంగా ఈ డ్రోన్ల పనితీరును చైనా చాలా గొప్పగా చెప్పుకుంటోంది. అయితే, దీనిపై భారత అధికారులు స్పందిస్తూ, ఆ డ్రోన్లు చైనా చెబుతున్నంత గొప్పవేమీ కావని అన్నారు. ఎలాంటి నియంత్రణలేని గగనతలాల్లోనూ, లేకపోతే, గగనతల ఆధిపత్యం ఉన్న చోట మాత్రమే వింగ్ లూంగ్-2 డ్రోన్లు ఉపయోగపడతాయని చెప్పారు.
ఉదాహరణకు.... ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్ యుద్ధ రంగాల్లో అమెరికా డ్రోన్లను వినియోగించిందని, ఆ సమయంలో గగనతలంలో అమెరికా ఆధిపత్యం కొనసాగింది కాబట్టి వారి డ్రోన్లకు ఎదురులేకుండా పోయిందని, కానీ భారత్ తో చైనా, పాకిస్థాన్ సరిహద్దుల వద్ద డ్రోన్లతో ఏదైనా చేద్దామనుకుంటే అది వీలు కాదని భారత వాయుసేన అధికారులు అభిప్రాయపడ్డారు. ఏదైనా డ్రోన్ గీత దాటి వస్తే మన రాడార్ల కంటపడకుండా తప్పించుకోలేదని, సులభంగా కూల్చివేస్తామని వెల్లడించారు.
కాగా, వింగ్ లూంగ్-2 డ్రోన్ 11 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది గంటకు 370 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది. దీని ద్వారా ఎఫ్ టీ శ్రేణి బాంబులు, బీఆర్ఎం, ఏకేడీ, బీఏ శ్రేణి క్షిపణులు ప్రయోగించే వీలుంది. గగనతల నిఘాతో పాటు దాడులకు ఉపయోగపడుతుంది.