IMD: అతి శీతలం కమ్ముకొస్తోంది.... మద్యం తాగొద్దు: భారత వాతావరణ సంస్థ కీలక హెచ్చరిక
- ఉత్తరాదిన మరింత తగ్గనున్న ఉష్ణోగ్రతలు
- డిసెంబరు 28 నుంచి తీవ్రం కానున్న చలి, మంచు
- మద్యం తాగితే శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుందన్న ఐఎండీ
- విటమిన్ సి మాత్రలు, పండ్లు తీసుకోవాలని సూచన
భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ఆసక్తికర అంశం వెల్లడించింది. ఉత్తర భారతదేశంలో చలి ప్రభావం అతి తీవ్రం కానుందని, ఆ సమయంలో మద్యం తాగడం ప్రమాదకరమని స్పష్టం చేసింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తర రాజస్థాన్ లో డిసెంబరు 28 నుంచి అతి శీతల వాతావరణం కనిపిస్తుందని ఐఎండీ హెచ్చరించింది.
దీని ప్రభావంతో ఫ్లూ జ్వరాలు, జలుబు, ముక్కు దిబ్బడ, వంటి లక్షణాలు తలెత్తుతాయని వివరించింది. ఈ సమయంలో మద్యం తాగరాదని, ఆల్కహాల్ ప్రభావంతో శరీర ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని స్పష్టం చేసింది. ఆరోగ్యపరంగా ఈ మార్పు ఎంతో నష్టం కలుగజేస్తుందని పేర్కొంది. ఇంటిపట్టునే ఉంటూ విటమిన్-సి మాత్రలు, పండ్లు, మాయిశ్చరైజర్లతో అతి శీతలాన్ని ఎదుర్కోవచ్చని ఐఎండీ తెలిపింది. ఆది, సోమవారాల్లో ఉత్తరాదిన మంచు ప్రభావం పెరగనుందని ఐఎండీ ప్రాంతీయ హెచ్చరికల విభాగం చీఫ్ కుల్దీప్ శ్రీవాస్తవ వెల్లడించారు.