Moon: భార్యకు చంద్రుడిపై 3 ఎకరాల స్థలం కానుకగా ఇచ్చిన భర్త!
- పెళ్లి రోజు సందర్భంగా స్థలం కొన్నానన్న రాజస్థాన్ వ్యక్తి
- ఉఫ్పొంగిపోయిన భార్య.. చంద్రమండలంపై ఉన్నట్టే ఉందని హర్షం
- స్థలం పేపర్లకు ఫ్రేమ్ కట్టించి బహుమతిగా ప్రదానం
‘చంద్రగోళంలో ఆక్సిజన్ నింపి.. అక్కడ నీకొక ఇల్లు కడతా’.. ఇది ఓ సినిమాలోని పాటలో ఓ లైన్. సినిమా ఏంటి.. నిజజీవితంలోనూ ప్రేయసి కోసం అవసరమైతే ఆ జాబిల్లినే కిందకు దించేస్తా అనే కోతలరాయుళ్లు కోకొల్లలు. వాళ్లు నిజంగా చేస్తారో లేదో తెలియదు గానీ.. రాజస్థాన్ లోని అజ్మీర్ కు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన భార్యపేరిట చంద్రగోళంపై స్థలాన్ని రాసిచ్చేశాడు. పెళ్లిరోజు కానుకగా ఆ పత్రాలను తన భార్యకు అందించాడు. అంత మంచి కానుక అందిన భార్య ఉప్పొంగిపోకుండా ఉంటుందా!!
తన భార్య సప్నా అనిజా కోసం ఏదైనా కొత్తగా చేయాలనుకున్న ధర్మేంద్ర అనిజా అనే వ్యక్తి.. లూనా సొసైటీ ఇంటర్నేషనల్ ద్వారా చంద్రమండలంపై మూడెకరాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఆ కొనుగోలు ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి దాదాపు ఏడాది పట్టిందని ధర్మేంద్ర చెప్పాడు. ‘‘డిసెంబర్ 24 మా పెళ్లి రోజు. నా భార్య కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకున్నా. అందరూ కార్లు, నగల వంటివి కానుకలుగా ఇస్తుంటారు. నేనూ అవే ఇస్తే కొత్తదనం ఏముందనుకున్నా. అందుకే జాబిల్లి మీద ఆమె కోసం స్థలం కొన్నా’’ అని ధర్మేంద్ర వివరించాడు. చంద్రమండలంపై స్థలం కొన్న మొట్టమొదటి రాజస్థానీని బహుశా తానే కావొచ్చేమో అని అన్నాడు. స్థలం కొన్నందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్పారు.
ఇంత ప్రత్యేకమైన బహుమతిని తన భర్త ఇస్తాడని అసలు ఊహించలేదంటూ ఆ ఇల్లాలు తెగ సంబరపడిపోయింది. ఇంత మంచి కానుక దక్కినందుకు చాలా ఆనందంగా ఉందని సప్న చెప్పింది. ప్రొఫెషనల్ ఈవెంట్ ఆర్గనైజర్లు పార్టీని పెట్టి బహుమతిని అందజేశారని చెప్పింది. ఫ్రేమ్ కట్టిచ్చిన చంద్రుడి స్థలం తాలూకు పత్రాలను తన భర్త ఇచ్చాడని తెలిపింది. నిజంగా చంద్రుడి మీదే ఉన్నట్టనిపించిందని ఉప్పొంగిపోయింది.
నిజానికి ఎక్కడో దూరంగా ఉన్న చంద్రుడిపై స్థలాన్ని సొంతం చేసుకోవడమన్నది సాధ్యంకాని పని. అయితే, అక్కడ స్థలాన్ని సొంతం చేసుకోవాలనుకునే కొందరు ఔత్సాహికుల తృప్తి కోసం కొన్ని వెబ్ సైట్లు చంద్రుడిపై కొన్ని భాగాలను అమ్మి సర్టిఫికెట్ ను ఇస్తున్నాయి. అంతకుముందు 2018లో బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా జాబిల్లిపై స్థలం కొన్నట్టు చెప్పాడు. మేర్ మస్కోవియెన్స్ అనే చంద్రుడి చీకటి ప్రాంతంలో దానిని కొనుగోలు చేశానన్నాడు. కొన్ని నెలల క్రితం బీహార్ లోని బుద్ధ గయకు చెందిన నీరజ్ కుమార్ అనే వ్యక్తి కూడా.. తన పుట్టిన రోజు సందర్భంగా సుశాంత్ స్ఫూర్తితో చంద్రుడిపై ఎకరా స్థలాన్ని కొన్నట్టు చెప్పాడు.