BJP: బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నీ ఏకమవ్వాలి.. శరద్ పవార్ నాయకుడవ్వాలి!: సామ్నా పత్రిక వ్యాసంలో శివసేన

Sena says need united opposition front Pawar should lead it

  • కొత్త యూపీఏగా ఏర్పడాలి..
  • టీఆర్ఎస్, వైఎస్సార్ సీపీ వంటి పార్టీలన్నీ కలిసి రావాలి
  • కాంగ్రెస్ నాయకత్వం చాలా బలహీనమైపోయింది
  • మోదీ లాంటి నాయకుడు, అమిత్ షా లాంటి రాజకీయ చాణక్యుడు లేరు
  • ప్రభుత్వాన్ని విమర్శించే ముందు ప్రతిపక్షమే ఆత్మవిమర్శ చేసుకోవాలి

బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ‘యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ)’ కింద ఏకం కావాల్సిన అవసరం ఉందని శివసేన వ్యాఖ్యానించింది. కూటమికి శరద్ పవార్ నేతృత్వం వహించాలని పరోక్షంగా పేర్కొంది. ప్రస్తుతం కాంగ్రెస్ చాలా బలహీనంగా మారిందని అభిప్రాయపడింది. తమ పత్రిక సామ్నా ఎడిటోరియల్ లో శివసేన ఈ వ్యాఖ్యలు చేసింది.

ప్రతిపక్షం బలహీనంగా ఉండడం, ముక్కలైపోవడం వల్లే రైతుల ఆందోళనలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించింది. గురువారం రైతులకు మద్దతుగా రాహుల్ గాంధీ నేతృత్వంలో మోర్చా నిర్వహించారని, కానీ, కాంగ్రెస్ లోని సొంత నేతలే రాహుల్ ను సీరియస్ గా తీసుకోలేదంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యానించారని గుర్తు చేసింది.

‘‘శక్తిమంతమైన ప్రతిపక్షం లేనప్పుడు ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది. ప్రభుత్వాన్ని నిందించేకన్నా ముందు ప్రతిపక్షం తనను తాను ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాహుల్ గాంధీ ఒంటరిగా చాలా గట్టిగానే పోరాడుతున్నా.. ఏదో లోపించింది. మంత్రి చెప్పినట్టు యూపీఏలోని కొన్ని భాగస్వామ్య పార్టీలు రైతు ఆందోళనలను తీవ్రంగా తీసుకోవట్లేదు’’ అని శివసేన వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ నాయకత్వాన్ని బీజేపీ ఎందుకు అవహేళన చేస్తోందో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒకసారి చర్చించాలని సూచించింది. యూపీఏకి నరేంద్ర మోదీ లాంటి గట్టి నేతగానీ, అమిత్ షా లాంటి రాజకీయ చాణక్యుడుగానీ లేడని పేర్కొంది.

తెలంగాణ రాష్ట్ర సమితి అధిపతి కేసీఆర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, అకాలీ దళ్, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ, సమాజ్ వాదీ, ఒడిశాలోని బిజూ జనతాదళ్, కర్నాటకలోని  జేడీఎస్ వంటి పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగానే పనిచేస్తున్నాయన్న శివసేన.. ఆ పార్టీలు, ఆ పార్టీల నేతలు యూపీఏలో భాగస్వాములుగా లేరని చెప్పింది. ఆ పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటైతేగానీ శక్తిమంతమైన ప్రతిపక్షం ఏర్పడదని పేర్కొంది.

శరద్ పవార్ చాలా శక్తిమంతమైన, స్వతంత్ర వ్యక్తి అని వ్యాఖ్యానించిన శివసేన.. ఆయన వల్ల మోదీ సహా ఎంతో మంది బాగుపడ్డారని చెప్పింది. బెంగాల్ లో తృణమూల్ ను బీజేపీ చీల్చే కుట్ర చేస్తోందని, మమతా బెనర్జీ ఒంటరిగా పోరాడుతున్నారని, ప్రతిపక్షాలన్నీ ఆమెకు అండగా నిలవాలని సూచించింది.

  • Loading...

More Telugu News