Xiaomi: యాపిల్ బాటలోనే షావోమీ.. ఫోన్ తో చార్జర్ ఇవ్వరట!
- ధ్రువీకరించిన షావోమీ సీఈవో లీ జూన్
- పర్యావరణం కోసమేనని ప్రకటన
- రేపే ఎంఐ 11 ఫోన్ విడుదల
- మన దగ్గర ఖరీదు రూ.50 వేలు!
ఫోన్ కొంటే దాంతో పాటు చార్జర్, హెడ్ ఫోన్స్ కూడా రావడం కామన్. కానీ, కొద్ది రోజుల క్రితం అవేవీ లేకుండా ఒక్క ఫోన్ నే ఇస్తామని ప్రకటించింది యాపిల్. ఇప్పుడు యాపిల్ బాటలోనే షావోమీ కూడా నడుస్తోంది. సోమవారం విడుదల చేయబోతున్న ఫ్లాగ్ షిప్ ఫోన్ షావోమీ 11తో పాటు చార్జర్ ఇవ్వరట. అది కావాలంటే విడిగా డబ్బులు పెట్టి కొనుక్కోవాలట. దానికి వాళ్లు చెబుతున్న సాకు.. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం!!
ఈ విషయాన్ని షావోమీ సీఈవో లీ జూన్ స్వయంగా ధ్రువీకరించారు. వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించి పర్యావరణ లక్ష్యాలను అందుకునేందుకే చార్జర్ ను ఇవ్వట్లేదని జూన్ చెప్పారు. ఫోన్ బాక్స్ ప్యాకింగ్ నూ వీలైనంత మేర తగ్గిస్తున్నట్టు చెప్పారు. బాక్స్ పై డిజైన్ కేవలం 11 అని మాత్రమే ఉంటుందని వెల్లడించారు. ఫోన్ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదని తెలిపారు.
స్నాప్ డ్రాగన్ 888 ఎస్వోసీ ప్రాసెసర్ తో నడిచే ఈ ఫోన్.. 8 జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో ఉంటుంది. దీని ఖరీదు దాదాపు రూ.50 వేల వరకు ఉంటుందని తెలుస్తోంది. 108 మెగాపిక్సెల్ తో కూడిన మూడు లెన్సుల ప్రైమరీ కెమెరా, అల్ట్రావైడ్ సెకండరీ లెన్స్ కెమెరాలు ఉంటాయని కంపెనీ లీకులిచ్చింది. కెమెరా జూమ్ ను 30 రెట్ల వరకు పెంచుకునేలా మూడో లెన్స్ ఉంటుందని తెలుస్తోంది.