YV Subba Reddy: 60 ఏళ్ల వృద్ధురాలిని తిరుమల కొండపైకి మోసుకొచ్చిన కానిస్టేబుల్ ఆర్షద్ సేవలు అభినందనీయం: వైవీ సుబ్బారెడ్డి
- ఇటీవల తిరుమలలో సంఘటన
- అన్నమయ్య మార్గంలో తిరుమల వచ్చేందుకు వృద్ధురాలి యత్నం
- రాలేక ఇబ్బంది పడిన వైనం
- భుజాలపై మోసుకుంటూ తిరుమల చేర్చిన కానిస్టేబుల్
ఈ నెల 23 తేదీన ఓ వృద్ధురాలు తిరుమల వెళ్లేందుకు అన్నమయ్య మార్గంలో పయనిస్తూ, వార్ధక్యం కారణంగా రాలేక ఎంతో ఇబ్బందులకు గురైంది. అయితే, ఆ 60 ఏళ్ల వృద్ధురాలి బాధను గుర్తించిన కానిస్టేబుల్ అర్షద్ ఆమెను తిరుమల కొండపైకి మోసుకుంటూ వచ్చాడు. కొండలు, గుట్టలు దాటుకుంటూ రాళ్లతో కూడిన దారిలో 6 కిలోమీటర్లు పయనించి ఎట్టకేలకు ఆమెను తిరుమల చేర్చాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
దీనిపై టీడీపీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఆ వృద్ధురాలిని కడప జిల్లాకు చెందిన షేక్ అర్షద్ అనే స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ తన భుజాలపై మోసుకుంటూ ఆరు కిలోమీటర్లు పయనించి స్వామి వారి దర్శనానికి తీసుకువచ్చిన ఘటన తన దృష్టికి వచ్చిందని తెలిపారు. అయితే, షేక్ అర్షద్ ను అభినందించేందుకు ఫోన్ చేస్తే అతడు చెప్పిన సమాధానం ఎంతో ఆశ్చర్యానికి గురిచేసిందని, ఆ విషయాన్ని అందరితో పంచుకోవాలనుకుంటున్నానని వైవీ సుబ్బారెడ్డి మీడియాతో తెలిపారు.
"వృద్ధురాలిని ఎంతో కష్టపడి భుజాలపై ఎలా కొండపైకి మోసుకురాగలిగావు అని అర్షద్ ను అడిగాను. అందుకు అతడేం చెప్పాడో తెలుసా... నన్ను ఆ వెంకటేశ్వరస్వామే నడిపించాడు సార్ అని వెల్లడించాడు. అతడి పేరు షేక్ అర్షద్. ఏ మతస్తుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ వ్యక్తి చెప్పిన మాటలను గొప్ప సందేశంగా భావిస్తున్నాను. మన కలియుగ దైవం ఎంత గొప్పవాడో చెప్పే సమాధానం ఇది. మన స్వామి అన్ని మతాల వారిపైనా ఆదరణ చూపుతాడని వెల్లడైంది. ఆ కానిస్టేబుల్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇలాంటి వ్యక్తులకు ప్రత్యేక గుర్తింపు వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని, సంబంధిత అధికారులను కోరుతున్నాను" అంటూ వైవీ వివరించారు.