Placenta: మాయ దాకా చేరిన మాయదారి ప్లాస్టిక్ రేణువులు!
- ఇటలీలోని రోమ్ ఇనిస్టిట్యూట్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
- తల్లీ బిడ్డలకు దీర్ఘకాలిక సమస్యలొచ్చే ముప్పుందని ఆందోళన
- బిడ్డ రక్తంలో కలిసే ప్రమాదమూ లేకపోలేదంటున్న పరిశోధకులు
ప్లాస్టిక్ లేనిదే ప్రపంచం లేదన్నట్టు తయారైంది ప్రస్తుత పరిస్థితి. తినే ఆహారం, తాగే నీళ్లు, బైకులు, కార్లు.. ఒక్కటేమిటి దాదాపు అన్ని రూపాల్లోనూ అది మనకు దగ్గరైపోయింది. అదే ఎనలేని చేటు చేస్తోంది. వాడిపారేసిన ప్లాస్టిక్ కవర్లను తిని ఎన్నో ఆవులు, మూగ జీవులు, సముద్ర ప్రాణులు ప్రాణాలొదిలిన ఘటనలున్నాయి. ఆ ప్లాస్టిక్ ఇప్పుడు తల్లి గర్భంలోని మాయ వరకు వెళ్లింది. శాస్త్రవేత్తలను ఆందోళనకు గురి చేస్తోంది.
తల్లి, బిడ్డకు మధ్య వారథిగా ఉండే మాయలో చాలా చాలా సూక్ష్మమైన ప్లాస్టిక్ రేణువులున్నట్టు ఇటలీలోని రోమ్ ఇనిస్టిట్యూట్ సైంటిస్టులు చెప్పారు. ఆరుగురు గర్భిణుల నుంచి సేకరించిన నమూనాలను అధ్యయనం చేసి ఈ విషయాన్ని పరిశోధకులు నిర్ధారించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగానే ఉన్నా.. దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ సూక్ష్మ రేణువులను గుర్తించేందుకు రామన్ మైక్రోస్పెక్ట్రోస్కోపీ పద్ధతిని వినియోగించామన్నారు.
ఆరు మాయలపై పరీక్షలు చేస్తే నాలుగింట్లో వివిధ సైజుల్లోని 12 ప్లాస్టిక్ సూక్ష్మ రేణువుల ఆనవాళ్లు కనిపించాయని చెప్పారు. వాటిలో మూడు రేణువులు పాలిప్రొపిలీన్ అనే పాలిమర్ అని చెప్పిన పరిశోధకులు.. మిగతావి మనం వాడే కోటింగులు, పెయింట్లు, బంక, ప్లాస్టర్లు, గోర్ల పాలిష్, పాలిమర్స్, చర్మ సౌందర్యానికి వాడే కాస్మెటిక్స్, ఇతర ప్రొడక్ట్ లకు సంబంధించిన ప్లాస్టిక్ ముక్కలని వివరించారు. మాయలోని ప్లాస్టిక్ రేణువులు బిడ్డ ఒంట్లోకి వెళితే రక్తంలోకి ప్రసరించే ముప్పు ఉంటుందని హెచ్చరించారు.