Kethireddy: తాడిపత్రి ఘటనలో ఎమ్మెల్యే కేతిరెడ్డి, ఆయన కుమారులపై కేసులు నమోదు
- ఇటీవల తాడిపత్రిలో ఉద్రిక్తతలు
- జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వర్గం దాడులు
- స్పందించిన డీఎస్పీ చైతన్య
- అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం కేసులు నమోదు
- త్వరలోనే అరెస్టులు ఉంటాయని డీఎస్పీ వెల్లడి
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇటీవల టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలోకి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన అనుచరులు ఆగ్రహావేశాలతో దూసుకురావడం తెలిసిందే. దీనిపై తాడిపత్రి డీఎస్పీ చైతన్య స్పందించారు. దీనిపై లాయర్ శ్రీనివాసులు ఫిర్యాదు చేశారని వెల్లడించారు.
వారి ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పైనా, ఆయన కుమారుల పైనా కేసులు నమోదు చేశామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తో పాటు హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసినట్టు వివరించారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. కాగా, జేసీ కారు డ్రైవర్ సుబ్బరాయుడును కులం పేరుతో దూషించారంటూ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.
అటు, ఈ ఘటనకు కేంద్రబిందువుగా భావిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ కిరణ్ పై దాడి ఘటనలోనూ పెద్దారెడ్డి, ఆయన కుమారులపై కేసు నమోదైంది.