India: 'కంగారు' పడ్డారు... 100 పరుగులకు చేరకుండానే ఆరువికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా!
- బౌలర్లందరికీ లభించిన వికెట్లు
- పట్టు బిగించిన ఇండియా జట్టు
- 40 పరుగులు చేసిన ఓపెనర్ వేడ్
- రవీంద్ర జడేజాకు రెండు వికెట్లు
ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఇండియా పట్టు బిగించింది. 195 పరుగులకు ఆలౌట్ అయిన ఆసీస్ జట్టును రెండో ఇన్నింగ్స్ లోనూ ముప్పుతిప్పలు పెడుతోంది. భారత బౌలర్లు వేస్తున్న పదునైన బంతులకు సమాధానం ఇవ్వలేక, ఆసీస్ ఆటగాళ్లు కంగారుపడ్డారు. దీంతో జట్టు రెండో ఇన్నింగ్స్ స్కోరు 100 పరుగులను దాటకుండానే ఆరు టాప్ ఆర్డర్ వికెట్లను కోల్పోయింది. భారత జట్టు బౌలర్లలో ప్రతి ఒక్కరికీ కనీసం ఒక వికెట్ లభించడం గమనార్హం.
ఈ ఉదయం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్ వేడ్ మాత్రమే కాసేపు నిలదొక్కుకుని 40 పరుగులు చేశాడు. ఆరంభంలోనే జోయ్ బుర్న్స్ వికెట్ ను ఉమేష్ యాదవ్ తీయగా, ఆపై 28 పరుగులు చేసి కాస్తంత నిలదొక్కుకున్నట్టు కనిపించిన మార్నుస్ లబుస్ చేంజ్ ని అశ్విన్ తన అద్భుత బాల్ తో బురిడీ కొట్టించాడు.
ఆపై స్టీవ్ స్మిత్ ను 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయగా, ట్రావిస్ హెడ్ 17 పరుగుల వద్ద మహమ్మద్ సిరాజ్ కు దొరికిపోయాడు. టిప్ పైనీ వికెట్ ను జడేజా తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఆసీస్ కుదేలైంది. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 52 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 105 పరుగులు.
భారత బౌలర్లలో జడేజాకు రెండు వికెట్లు దక్కగా, బుమ్రా, యాదవ్, సిరాజ్, అశ్విన్ లకు తలో వికెట్ లభించాయి. మ్యాచ్ ఇంకా మూడవ రోజులోనే ఉండటం, ఆసీస్ జట్టు భారత తొలి ఇన్నింగ్స్ స్కోరుతో పోలిస్తే వెనుకబడి వుండటంతో ప్రస్తుతానికి మ్యాచ్ ఇంకా భారత్ చెయ్యి దాటి పోలేదనే చెప్పవచ్చు.