Vijay Sai Reddy: రుషికొండలో స్వాధీనం చేసుకున్న కబ్జా భూమి ఎవరిది?: వెలగపూడిపై విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు
- అను"కుల" మీడియా ముందుకొచ్చి ప్రమాణాలంటూ పులి వేషాలేస్తాడు
- అసలు విషయానికి వచ్చేసరికి తోక ముడుస్తాడు
- ఒక్క గజం ఆక్రమించినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా అన్నాడు
టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి భూ ఆక్రమణల ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఆ ఆరోపణలను విజయసాయిరెడ్డి నిరూపించాలని వెలగపూడి సవాల్ చేశారు. సాయిబాబా గుడికి వచ్చి ప్రమాణం చేయాలని కూడా సవాలు విసిరారు. దీనిపై విజయసాయిరెడ్డి మరోసారి పరోక్షంగా స్పందిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
‘అను"కుల" మీడియా ముందుకొచ్చి ప్రమాణాలంటూ పులి వేషాలేస్తాడు.. అసలు విషయానికి వచ్చేసరికి తోక ముడుస్తాడు. ఒక్క గజం ఆక్రమించినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ కోతలు కోశాడు. మరి మొన్న అధికారులు రుషికొండలో స్వాధీనం చేసుకున్న 225 గజాల కబ్జా భూమి ఎవరిది?’ అని ఆయన ప్రశ్నించారు.
కాగా, విశాఖపట్నంలో ఇటీవల అధికారులు భూ ఆక్రమణలపై కొరడా ఝుళిపించారు. రుషికొండలోని సర్వే నెంబరు 21లో ఉన్న కొంత భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని, ఈ భూమి ప్రభుత్వానిదని, అయితే, ఇంతకాలం విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అధీనంలో ఉందని పేర్కొన్నారు.