MBBS: హైదరాబాదులో 100కి పైగా నకిలీ డాక్టర్లు... దృష్టిసారించిన పోలీసులు

Police busted fake MBBS certificates issue

  • ఫేక్ ఎంబీబీఎస్ సర్టిఫికెట్లతో డాక్టర్ అవతారం
  • పొరుగు రాష్ట్రాల నుంచి సర్టిఫికెట్ల కొనుగోలు
  • ఢిల్లీలో కన్సల్టెంట్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • రూ.2 లక్షలకు నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్ విక్రయం

హైదరాబాదులో నకిలీ వైద్యులు ఆసుపత్రులు ఏర్పాటు చేసుకుని మరీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్లు కొనుగోలు చేసి ఇక్కడ డాక్టర్లుగా చెలామణి అవుతున్నట్టు పోలీసులు, వైద్య శాఖ అధికారులు గుర్తించారు. ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్ పొందిన వైఎస్ తేజ అనే వ్యక్తి పోలీసులను కూడా ఏమార్చాడు. అతడు లాక్ డౌన్ సమయంలో పోలీసులకు కరోనా సలహాదారుగా వ్యవహరించిన వైనం దిగ్భ్రాంతి కలిగిస్తోంది.

ఢిల్లీకి చెందిన సునీల్ అనే ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ద్వారా తేజ, షాబాద్ కు చెందిన రాంరెడ్డి అనే వ్యక్తి నకిలీ డాక్టర్ సర్టిఫికెట్లు పొందారని పోలీసులు తెలిపారు. వీరికి చత్తీస్ గఢ్ యూనివర్సిటీ తరఫున ఎంబీబీఎస్ సర్టిఫికెట్లు ఇచ్చినట్టు వెల్లడించారు. దీనిపై మేడిపల్లి పోలీస్ ఇన్ స్పెక్టర్ బి.అంజిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రూ.40 వేలు ఇస్తే నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్ ఫొటోకాపీ ఇస్తామని, ఆపై రూ.2 లక్షలు చెల్లిస్తే అసలైన నకిలీ సర్టిఫికెట్ ను పంపించే విధంగా తేజ ఆ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడని వివరించారు.

పోలీసులు ఢిల్లీలో ఉన్న ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ సునీల్ ను అరెస్ట్ చేయడంతో అనేకమందికి నకిలీ ఎంబీబీఎస్ పట్టాలు విక్రయించిన విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆరోగ్య శాఖ అధికారులు విచారణకు తెరదీయగా, ఇలాంటి మున్నాభాయ్ ఎంబీబీఎస్ లు 100 మంది వరకు ఉన్నట్టు తేలింది.

  • Loading...

More Telugu News