AP High Court: ఈ విచారణ సరిపోదు... డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐకి స్పష్టం చేసిన హైకోర్టు
- అప్పట్లో డాక్టర్ సుధాకర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
- విశాఖ రోడ్లపై తాగి అల్లరి చేస్తున్నాడని పోలీసుల ఆరోపణ
- తన పట్ల అనుచితంగా ప్రవర్తించారన్న డాక్టర్ సుధాకర్
- హైకోర్టుకు చేరిన వ్యవహారం
- పోలీసుల తీరుపై సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టు
విశాఖ జిల్లాకు చెందిన డాక్టర్ సుధాకర్ మద్యం మత్తులో రోడ్డుపై నానాయాగీ చేస్తున్నారని పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే, నడిరోడ్డుపై పెడరెక్కలు వెనక్కి విరిచిన స్థితిలో, చొక్కా లేకుండా పోలీసుల అదుపులో ఉన్న డాక్టర్ సుధాకర్ ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. తన పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారంటూ సుధాకర్ ఆరోపించారు. ఈ వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లగా సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.
తాజాగా, విచారణ చేపట్టిన హైకోర్టు సీబీఐ తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. డాక్టర్ సుధాకర్ కేసులో పోలీసుల తీరుపై సీబీఐ సమర్పించిన నివేదిక సరిగాలేదని కోర్టు వ్యాఖ్యానించింది. అడిషనల్ డైరెక్టర్ స్థాయి అధికారిని నియమించి మరింత లోతైన విచారణ జరపాలని సీబీఐ అధికారులను ఆదేశించింది. నివేదిక అందించేందుకు 2021 మార్చి 31 వరకు గడువు విధించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ మొదటివారానికి వాయిదా వేసింది.