Kamal Haasan: కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిని నేనే.. స్పష్టం చేసిన కమలహాసన్
- తమిళనాడులో త్వరలోనే తృతీయ కూటమి
- భావసారూప్య పార్టీలతో చర్చలు
- అవినీతి రహిత పాలనే లక్ష్యం
మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) ఆధ్వర్యంలో త్వరలో ఏర్పాటు కానున్న తృతీయ కూటమి నుంచి తానే ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రముఖ నటుడు కమల హాసన్ స్పష్టం చేశారు. కూటమి ఏర్పాటు కోసం భావసారూప్య పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని, వచ్చే నెలలో ఈ విషయంలో ఓ స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. మూడో విడత ఎన్నికల ప్రచారం కోసం తిరుచ్చి వెళ్లిన కమల్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తన ప్రచారానికి ప్రజలు పెద్ద ఎత్తున వస్తుండడం ఆనందంగా ఉందని కమల్ పేర్కొన్నారు. తన ప్రచారానికి వస్తున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. రాష్ట్రంలో లంచం ఇవ్వకుండా ఏ పనీ జరగడం లేదని విమర్శించారు. చివరికి జనన ధ్రువీకరణ పత్రానికి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మగబిడ్డకైతే రూ. 500, అమ్మాయికైతే రూ. 300 తీసుకుని ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచం ఇవ్వకుండా వితంతు పెన్షన్ కూడా రావడం లేదన్నారు.
తాము అధికారంలోకి వస్తే అవినీతి రహిత పాలన అందిస్తామని, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి కంప్యూటర్ అందజేస్తామని కమల్ హామీ ఇచ్చారు. అయితే, అవి ఉచితం కాదని, ప్రభుత్వ పెట్టుబడిగా మాత్రమేనని స్పష్టం చేశారు. రైతును గౌరవించని దేశం అభివృద్ధి చెందదన్న కమల్.. ఆ పరిస్థితి మన దేశానికి రాకూడదన్నారు. పార్టీ గుర్తు టార్చిలైట్ కోసం అవసరమైతే కోర్టుకు వెళ్తామని కమల్ పేర్కొన్నారు.