Vaccine: నాలుగు రాష్ట్రాల్లో టీకా డ్రై రన్ విజయవంతం!
- కరోనా టీకాపై మాక్ డ్రిల్
- ఏపీలో కృష్ణా జిల్లాలో కార్యక్రమం
- స్వయంగా పర్యవేక్షించిన కలెక్టర్ ఇంతియాజ్
కరోనా టీకా అందుబాటులోకి వచ్చిన తరువాత, దాన్ని ఎలా ప్రజలకు వేయాలన్న విషయమై నాలుగు రాష్ట్రాల్లో సోమవారం నాడు జరిగిన డ్రై రన్ విజయవంతం అయింది. ఏపీలోని కృష్ణా జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ఇంతియాజ్ స్వయంగా పర్యవేక్షించారు.
ఏపీతో పాటు పంజాబ్, అసోం, గుజరాత్ రాష్ట్రాల్లోనూ ఇదే తరహా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా, కొవిన్ సాఫ్ట్ వేర్ లో పేర్లను నమోదు చేసుకున్న వారి సెల్ ఫోన్లకు మెసేజ్ పంపించి, ఫలానా చోటకు రావాలని కోరారు. వారు వచ్చిన తరువాత, అప్పటికే శిక్షణ తీసుకున్న వైద్య సిబ్బంది రంగంలోకి దిగారు.
తమ మాక్ డ్రిల్ లో భాగంగా, తొలుత థర్మల్ స్కానింగ్, ఆపై పోలీసుల చెకింగ్ అనంతరం, వివరాలు సరిచూసుకుని, మరో గదిలోకి పంపారు. అక్కడ వారికి ఇంజక్షన్లు వేశారు. నిజమైన టీకా మినహా మిగతా అంతా ప్రక్రియను యథాతథంగా నిర్వహించారు. ఆరోగ్య సిబ్బందిని సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది. ఏపీలో మొత్తం ఐదు చోట్ల ఈ కార్యక్రమం సాగగా, ఒక్కో ప్రాంతంలో 25 మందికి చొప్పున ఎంపిక చేసి డమ్మీ టీకాలు వేశారు.
ఇక గుజరాత్ లోని గాంధీనగర్, రాజ్ కోట్ జిల్లాలతో పాటు పంజాబ్ లోని లూధియానా, షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లాల్లో, అసోంలోని సోనిత్ పూర్, నల్బరీ జిల్లాల్లో సైతం డ్రై రన్ విజయవంతం అయిందని అధికారులు తెలిపారు. మొత్తం ప్రక్రియలో ఎటువంటి సమస్యలూ ఎదురు కాలేదని, నేడు కూడా ఇదే తరహా కార్యక్రమాన్ని మరోమారు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
కాగా, తాజాగా కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో కొత్త స్ట్రెయిన్ ప్రవేశించిందా? అన్న విషయాన్ని జీనోమ్ సీక్వెన్సింగ్ విధానంలో గుర్తించేందుకు 10 ల్యాబొరేటరీలను ఇప్పటికే కేంద్రం గుర్తించింది. పాజిటివ్ నమూనాలను ఈ ల్యాబ్ లకు పంపాలని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించింది. వీటిల్లో హైదరాబాద్ కు చెందిన సీఎస్ఐఆర్ - సీసీఎంబీ, సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్ ల్యాబ్ లు కూడా ఉన్నాయి.