COVID19: కరోనా టీకా కొవిషీల్డ్ డోసుల్లో ఎక్కువ వాటా మనకే!
- విదేశీ ఎగుమతులకు డబ్ల్యూహెచ్ వో అనుమతి తప్పనిసరి
- జనవరి నుంచి టీకా పంపిణీ జరగొచ్చన్న సీరమ్ సీఈవో పూనావాలా
- ధర రూ.వెయ్యి అయినా.. ప్రభుత్వానికి తక్కువకే ఇస్తామని హామీ
సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిడ్ 19 వ్యాక్సిన్ కొవిషీల్డ్ డోసులు ఎక్కువ మొత్తంలో మన దేశానికే అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు టీకాను ఎగుమతి చేయాలంటే డబ్ల్యూహెచ్ వో ముందస్తు అర్హతల అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, అందుకు మన దేశంలో టీకా పంపిణీకి అనుమతులొచ్చాక దాదాపు నెల సమయం పట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే మనకే ఎక్కువ డోసులు అందుతాయని చెబుతున్నారు. ఇప్పటికే 4 కోట్ల నుంచి 5 కోట్ల డోసులను సీరమ్ ఉత్పత్తి చేసి రెడీగా పెట్టింది.
జనవరి నుంచి కొవిడ్ 19 వ్యాక్సిన్ కొవిషీల్డ్ పంపిణీ జరిగే అవకాశముందని సీరమ్ సీఈవో అదర్ పూనావాలా చెప్పారు. కొత్త సంవత్సరంలో శుభవార్త అందుతుందన్నారు. కొన్ని రోజుల్లో వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగ అనుమతులు వచ్చే అవకాశముందన్నారు. ప్రతి వారం పెద్ద సంఖ్యలో టీకాలను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. అనుమతులకు అవసరమయ్యే ప్రతి సమాచారాన్ని అందజేశామని, ఔషధ నియంత్రణ సంస్థలు ఆ సమాచారాన్ని విశ్లేషిస్తున్నాయని ఆయన చెప్పారు. బ్రిటన్, ఇండియాల్లో ఒకేసారి అనుమతులు వచ్చే అవకాశముందన్నారు.
బహిరంగ మార్కెట్ లో వ్యాక్సిన్ ధర రూ.1000గా ఉంటుందని, అయితే, ప్రభుత్వానికి తక్కువ ధరకే అందజేస్తామని పూనావాలా వివరించారు. ఆగస్టు నుంచి వ్యాక్సిన్ల సరఫరా పెరుగుతుందని, అప్పటికే మిగతా సంస్థలు కూడా తమ వ్యాక్సిన్లను మార్కెట్ లోకి తీసుకొస్తాయని అన్నారు. మరోవైపు ప్రపంచం మొత్తానికి కరోనా వ్యాక్సిన్లను అందించే ఉద్దేశంతో డబ్ల్యూహెచ్ వో ఏర్పాటు చేసిన కొవ్యాక్స్ గ్రూప్ తోనూ సీరమ్ ఒప్పందం చేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల డోసులను ఎగుమతి చేయనుంది. కొవ్యాక్స్ గ్రూప్ లో మన దేశమూ భాగస్వామిగా ఉందని, అందులోని దేశాలన్నింటికీ భారీ సంఖ్యలో వ్యాక్సిన్ డోసులు అందుతాయని పూనావాలా చెప్పారు. తాము తయారు చేసే టీకాల్లో 50 శాతం డోసులను ఇండియా, కొవ్యాక్స్ కు అందజేస్తామన్నారు.