Kethireddy Peddareddy: నా కుటుంబం జోలికి వస్తే సహించను... రెచ్చగొడితే ఊరుకోను: వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
- ఇటీవల తాడిపత్రిలో ఉద్రిక్తతలు
- జేసీ ఇంటికి కార్యకర్తలతో కలిసి వెళ్లిన కేతిరెడ్డి
- దాడులు చేశారంటూ జేసీ వర్గం ఆరోపణ
- పోలీసులు కేసులు నమోదు చేశారన్న కేతిరెడ్డి
- జేసీ రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు
కొన్నిరోజుల కిందట అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగిన సంగతి తెలిసిందే. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దండెత్తినంత పనిచేశారు. దీనిపై కేతిరెడ్డి మీడియాకు వివరణ ఇచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన అనుచరులు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతూ ప్రశాంతతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని, ఆ విషయాన్ని పరిష్కరించేందుకే జేసీ ఇంటికి వెళ్లానని తెలిపారు.
గతంలోనూ జేసీ తన కుమారులను హెచ్చరిస్తూ మీడియాలో మాట్లాడారని, తన కుటుంబ సభ్యులపై ఇప్పుడు కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేతిరెడ్డి మండిపడ్డారు. తన కుటుంబం జోలికి ఎవరొచ్చినా ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇకనైనా రెచ్చగొట్టే మాటలు మానుకోవాలని హితవు పలికారు. తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు శాంతియుత జీవనం గడపాలన్నదే తమ ఆకాంక్ష అని స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెల్లడించారు.