Car: కారు కొనక్కర్లేదు.. లీజు తీసుకుంటే సరి!: కార్ల సంస్థల కొత్త స్కీం
- ఇప్పటికే మొదలుపెట్టేసిన మారుతీ, హ్యూందాయ్
- నెలవారీ ఫీజుతో సబ్ స్క్రిప్షన్ తీసుకునే అవకాశం
- 9 వేల మారుతీ, 4,500 హ్యూందాయ్ కార్లు లీజుకు
- మూడు వర్గాల కోసమేనంటున్న సంస్థలు
చాలా మందికి సొంతింటితో పాటు సొంత కారు అనేది ఓ కల. కానీ, చాలా మంది చేతిలో డబ్బుల్లేక కారు ప్రయత్నాలను ఆపేస్తుంటారు. అయితే, అలాంటి వాళ్లకు కంపెనీలు కొత్త ఆఫర్ ఇస్తున్నాయి. ‘కొనాల్సిన పనిలేదు.. లీజు తీసుకుంటే సరి’ అంటున్నాయి. దానికి డౌన్ పేమెంట్లు కట్టాల్సిన అవసరమూ లేదంటున్నాయి. నెలకో లేదంటే సంవత్సరానికో ఫీజు కడితే చాలంటున్నాయి. లీజు ఎన్ని రోజులు.. ఎన్నేండ్లన్నది సదరు వినియోగదారుడి ఇష్టానికే వదిలేస్తున్నాయి.
మారుతీ, హ్యూందాయ్ వంటి కంపెనీలు ఇప్పటికే ఈ లీజు వ్యవస్థను ప్రారంభించాయి. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబైల్లో ఈ సర్వీసులు మొదలయ్యాయి. నెల, ఏడాది వారీగా లీజును తీసుకునే వెసులుబాట్లు కల్పించాయి. గుర్గావ్ కు చెందిన రెవ్ అనే కంపెనీతో కలిసి హ్యూందాయ్, జపాన్ కు చెందిన ఓరిక్స్ కంపెనీతో కలిసి మారుతీలు ఈ లీజ్ పద్ధతిలో కారును సొంతం చేసుకునే పథకాలను ప్రారంభించాయి. కొత్త కార్లతో పాటు పాత కార్లనూ తక్కువ ధరకు లీజుకు ఇస్తున్నాయి.
నెలవారీ లేదా ఏడాది ఫీజుల్లో కారు మెయింటెనెన్స్, బీమా, ప్రయాణం చేసేటప్పుడు అకస్మాత్తుగా ఏదైనా సమస్య వస్తే సాయం చేసేందుకు రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటివన్నింటినీ కవర్ చేస్తున్నాయి. ప్రస్తుతం మారుతీ సుజుకీ స్విఫ్ట్ కారును నెలకు రూ.14,500 చొప్పున లీజుకిస్తున్నాయి.
అయితే, లీజుకు తీసుకునే బదులు ఆ మొత్తాన్నే నెలకు ఈఎంఐలుగా కట్టుకుంటే నాలుగైదేండ్లలో కారు మన సొంతమైపోతుందని నిపుణులు చెబుతున్నారు. అంత మొత్తం నెలకు కడితే రెండేండ్లకే రూ.మూడున్నర లక్షలవుతుందని అంటున్నారు. అలాంటప్పుడు లీజు వల్ల లాభమేంటని ప్రశ్నిస్తున్నారు. కంపెనీలు మాత్రం తమ లీజు పథకాన్ని సమర్థించుకుంటున్నాయి. కొందరి కోసమే ఈ స్కీమ్ అంటున్నాయి.
రెండు మూడేండ్లకోసారి కారును కొని అమ్మేసే వాళ్లకు కొనుగోళ్లు, అమ్మకాల ఇబ్బందుల్లేకుండా ఈ స్కీమ్ ఉపయోగపడుతుందని చెబుతున్నాయి. మూడు కేటగిరీల వాళ్లకు లీజు స్కీం బాగా పనికొస్తుందని వివరిస్తున్నాయి. రెండు మూడేండ్ల కోసారి కార్లను మార్చేసే సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు, ఎప్పుడూ బదిలీలు జరిగే ఉద్యోగాలు చేసే అధికారులు, అప్పుడే ఉద్యోగంలో చేరి కారు కొనే స్తోమత లేనివాళ్లకు ఈ కొత్త పద్ధతి బాగుంటుందని చెబుతున్నాయి.
పైలట్ ప్రాజెక్టుగా సెప్టెంబర్ లో ఈ స్కీమ్ ను ప్రారంభించామని, ఇప్పటిదాకా 9 వేల కార్లను లీజుకిచ్చామని మారుతీ సుజుకీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు. చాలా మంది దీనిపై ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ప్రస్తుతం ప్రారంభదశలోనే ఉన్నా.. రాబోయే రోజుల్లో ఈ వ్యాపారం ఊపందుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపు 20 నగరాల్లో సేవలందిస్తున్న హ్యూందాయ్.. 4,500 కార్లను లీజుకిచ్చింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో లీజు స్కీమ్ ను జనాల్లోకి తీసుకెళ్తున్నామని హ్యూందాయ్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విక్రయాలు, మార్కెటింగ్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ చెప్పారు.